అమరావతిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో రాజధాని గ్రామాల రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు. ఒకే చోట రాజధాని ఉండాలి ..పరిపాలన అంతా ఒక్క దగ్గరి నుంచే జరగాలి అని తీర్మానం కూడా చేశారు. అమరావతిపై పవన్ ఇలా వరుస మీటింగ్‌లతో బిజిబిజీగా ఉంటే..ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు పార్టీ సమావేశాలకు డుమ్మా కొట్టి మంత్రి కొడాలి నానితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇవాళ గుడివాడలో కొడాలినానీతో కలిసి ఎడ్లపందేల కార్యక్రమాన్ని ప్రారంభించిన రాపాక సీఎం జగన్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ చేస్తున్న సాహసం ఎంతో గొప్పదని రాపాక కొనియాడారు. సీఎంం జగన్ మంచి పరిపాలన అందిస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా అమరావతి రైతుల ఆందోళనల విషయంలో పవన్‌తో రాపాక విబేధించారు. రాజధాని రైతులు రోడ్ల మీద ధర్నాలు చేసే బదులు సీఎం జగన్‌ను కలిస్తే..న్యాయం జరుగుతుందని ఆయన సలహా ఇచ్చారు.
అయితే గతంలో కూడా రాపాక పలు సందర్భాల్లో జగన్ ఫోటోలకు పాలాభిషేకం కురిపించారు. స్వయంగా అధ్యక్షుడు పవన్‌తో తనకు విబేధాలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. తాజాగా వైసీపీ మంత్రి కొడాలి నానితో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడమే కాకుండా రాజధాని రైతులు సీఎం జగన్‌ను కలిస్తే న్యాయం జరుగుతుందని బహిరంగంగా ప్రకటించారు. రాపాక వ్యవహారశైలిపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్క అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతుల తరపున పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంటే..పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగన్‌కు జై కొట్టడాన్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలోనే ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రాపాకను సస్పెండ్ చేయాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ రోజుతో పవన్, రాపాకల మధ్య విబేధాలు ముదిరిపోయాయని మరింతగా స్పష్టమైంది. మొత్తంగా తన నిర్ణయాలను ధిక్కరిస్తూ వరుసగా అగౌరవపరుస్తున్నా రాపాకను సస్పెండ్ చేయలేని స్థితిలో పవన్ ఉన్నాడు. దీంతో అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతోంది అంటూ ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.