టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనల కార్యక్రమాల్లో భాగంగా వరుస డ్రామాలతో హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలెపెట్టి భిక్షాటన చేశారు.
దారిన పోయే వారి దగ్గర అమరావతి కోసం డబ్బులు ఇవ్వండి అంటూ అడుక్కుంటూ జోలె పట్టారు. అడుక్కోగా వచ్చిన డబ్బులను జేఏసీకి ఇచ్చేసి…సీఎం జగన్‌ను శాపనార్థాలు పెట్టి..అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఆవేశంగా లెక్చర్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే బాబుగారి భిక్షాటనపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తన భూములు కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అమరావతిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, రోజుకో డ్రామాతో రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. బందర్‌లో జోలె పట్టుకుని తిరగడానికి బాబుకు సిగ్గులేదా అంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు.
అమరావతి నిర్మాణానికి చంద్రబాబు ఇటుకలు అమ్మారని, హుండీలు ఏర్పాటు చేసి లక్షలకు లక్షలు వసూళ్లు చేశారని, ఆఖరకు ఎల్లోమీడియాతో కూడా విరాళాలు సేకరించారని, అవి ఏం చేశారో ఇంతవరకు తెలియదని మంత్రి ఫైర్ అయ్యారు. అమరావతిలో ఉద్యమం జరుగుతుందని అంటున్న చంద్రబాబు..మరి తన సొంత జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా..తాళిబొట్లు, ఉంగరాలు, నగలు, బంగారు గాజులు అంటూ మహిళల ఒంటిపై బంగారాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని కన్నబాబు ఫైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జేబుల్లోంచి డబ్బు కొట్టేసి..వాళ్లను రోడ్డున పడేస్తారా అంటూ కన్నబాబు బాబుపై మండిపడ్డారు.
ఇక వైసీపీ యువనేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడి వంటి నయవంచకుడి మాయలో పడి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, మీ పిల్లల భవిష్యత్తుకు సీఎం జగన్ భరోసా ఇస్తున్నారని రైతులకు హితవు పలికారు. అసలు చంద్రబాబు జోలి పట్టుకుని ఎందుకు భిక్షాటన చేశారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని అవినాష్ అన్నారు. అమరావతిపై కృత్రిమ ఉద్యమం చేయిస్తూ, రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు రాజకీయ లబ్థి పోందాలని చూస్తున్నారని అవినాష్ మండిపడ్డారు. మొత్తంగా చంద్రబాబు భిక్షాటనపై వైసీపీ మంత్రులు వేస్తున్న సెటైర్లు వింటే తెలుగు తమ్ముళ్లు సిగ్గుతో తలదించుకోవాల్సిందే..