పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం చేశారన్నారు.
ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు విరుద్ధంగా చంద్రబాబు చేసే బస్సు యాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు హెచ్చరించారు. విజయనగరంలోని సంఘం కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విశాఖకు రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారని, వ్యక్తిగత అక్కసుతో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది కుటుంబాలు వలస వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
విశాఖకు రాజధాని వస్తుందంటే స్వాగతించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తున్న వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులే. విశాఖ దూరాభారం అవుతుందని చేస్తున్న దుష్ప్రచారం నిజం కాదు. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత వాసులు వెళ్లలేదా? విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నాం.