చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా పేర్కొన్న విద్యను ప్రతీ చిన్నారికి అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదింటి తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని గురువారం సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పిల్లలను బడికి పంపుతున్న ప్రతీ పేదింటి తల్లికి ఏటా 15 వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు. చదువుకోవాలంటే ముందు కడుపు నిండాలని.. తల్లులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నామని.. అయితే వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరిగా 75 శాతం అటెండన్స్ ఉంటేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూరుతుందని… అర్హత ఉండి లబ్ది పొందని తల్లులు ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోవాలని సీఎం జగన్ విఙ్ఞప్తి చేశారు.అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, ఆయాల జీతాల పెంపు, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మార్పుల గురించి సీఎం జగన్ ప్రజలకు వివరించారు.