మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలు హింసాత్మకంగా మారుతున్నాయి. రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామరామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేసి ఆయన కారు అద్దాల పగులబెట్టి..ఆయనపై భౌతిక దాడికి ప్రయత్నించారు. పిన్నెల్లి గన్‌మెన్లు, డ్రైవర్లపై కూడా దాడికి తెగబడడం చూస్తుంటే.. పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. తనపై జరిగిన దాడిపై పిన్నెల్లి స్పందించారు. పక్కా ప్రణాళికతో టీడీపీ గూండాలు తనపై దాడి చేశారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పథకం ప్రకారం కొంతమంది బయటివారిని తీసుకొచ్చి ఈ దాడి చేయించారన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై దాడులు చేసి.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజధానిలో ఏదో జరిగిపోతున్నదని శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలని మాజీ సీఎం ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను గుంటూరు నుంచి విజయవాడకు సర్వీసు రోడ్డుపై వెళుతుండగా.. మూకుమ్మడిగా తన కారుపైకి 50 మందికిపైగా వచ్చి రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. కారును ధ్వంసం చేశారని, గన్‌మెన్‌పై దాడి చేశారని చెప్పారు. తనపై దాడికి పాల్పడింది రైతులు కాదని, టీడీపీ అల్లరిమూకలు, బయటినుంచి వచ్చిన గూండాలేనన్నారు. నిజంగా రైతులే దాడి చేసుంటే.. అప్పటికప్పుడు వాళ్ల చేతిలోకి రాళ్లు, కర్రలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలు, ఓ వర్గం వారు తమ కలలు చెరిగిపోతున్నాయనే అసూయతో దాడిచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారన్నారు. రాజధాని రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దని హితవు పలికారు. తన కారుమీద రాళ్లు వేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. తనపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని, చంద్రబాబే దీనికి బాధ్యత వహించాలని..పిన్నెల్లి డిమాండ్ చేశారు. అయితే పిన్నెల్లిపై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలే అని తెలుస్తోంది. ఈ మేరకు 10 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా పిన్నెల్లిపై దాడిని వైసీపీ ఎమ్మెల్యేలు, అంబటి, మల్లాది విష్ణు, రోజా తదితరులు ఖండించారు. ఇది కచ్చితంగా చంద్రబాబు కుట్రే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా పిన్నెల్లిపై జరిగిన దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అర్థమవుతుంది.