ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట, ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్‌పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను స్వాగతిస్తూ ప్రకటన చేశారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాద్యమవుతుందని, రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా మార్చే ఆలోచనను అంతా స్వాగతించాలని చిరు అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందంటూ మీడియాకు ప్రెస్‌మీట్ విడుదల చేశారు.
కాపు సామాజికవర్గానికే చెందిన చిరంజీవికి, పవన్‌కు ఉన్న కాపుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలలో చిరు, పవన్‌లను కాపులు నెత్తినపెట్టుకుంటారు. రాయలసీమలో కూడా కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆది నుంచి టీడీపీకి కాస్త దూరంగా ఉండే కాపులు రాజకీయంగా తటస్థంగా వ్యవహరించేవారు. అయితే వైయస్ హయాంలో కాపు సామాజికవర్గం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. వైయస్ కూడా కాపు సామాజికవర్గానికి రాజకీయంగా పెద్ద పీట వేశారు. వైయస్ మరణం తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు పలకడంతో కాపు సామాజికవర్గం చీలిపోయింది. ముఖ్యంగా కాపు రిజర్వేషన్లు అంశంలో చంద్రబాబును నమ్మి, అదీ పవన్ చెప్పాడని చెప్పి మెజారిటీ కాపులు తొలిసారిగా టీడీపీకి ఓటేశారు. అందుకే 2014లో గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది. వైసీపీ తృటిలో అధికారం కోల్పోయింది.
అయితే గత ఐదేళ్లలో చంద్రబాబును నమ్మి మోసపోయామని భావించిన కాపులు ఈ సారి వైయస్ తనయుడు జగన్‌కు జై కొట్టారు. ఫలితంగా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి పట్టు ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరవేయడంలో కాపుల ఓట్లు కీలకమయ్యాయి. అయితే తాజాగా మూడు రాజధానుల విషయంలో పవన్ వైఖరిని కాపులు తప్పుపడుతున్నారు. అమరావతి ఆందోళనలకు పవన్ మద్దతు పలకడం పట్ల కాపులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు ప్రకటించడం పట్ల కాపుల్లో హర్షం వ్యక్తమవుతుంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర వైజాగ్‌లో రాజధాని ఏర్పాటుతో డెవలప్ అవుతుందని కాపులు భావిస్తున్నారు. అలాగే కర్నూలులో రాజధాని ఏర్పాటుపై కూడా సీమ కాపులు, బలిజలు మద్దతు పలుకుతున్నారు. మొత్తంగా రాయలసీమ, నెల్లూరు ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాపులు మూడు రాజధానుల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నారు. చిరంజీవి చెప్పినట్లు మూడు రాజధానులు ఏర్పాటు అయితే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలుగుతాయని కాపులు ఆశిస్తున్నారు. అందుకే మూడు రాజధానుల ఏర్పాటును సమర్థించిన చిరుకు కాపులంతా జేజేలు కొడుతున్నారు. మరోవైపు పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నా…చంద్రబాబు సామాజికవర్గానిదే ఆధిపత్యం. అమరావతి ప్రాంతంలో బాబు కులం పెత్తనంపై కాపులు అసంతృప్తితో ఉన్నారు. అందుకే కాపులు మూడు రాజధానుల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. మూడు రాజధానుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి వెంటే నడుస్తామని, పవన్‌కు చెప్పినట్లు అమరావతికి మద్దతు ఇచ్చేది లేదని కాపు సామాజికవర్గం తేల్చి చెబుతోంది. అందుకే అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు కాపు సామాజికవర్గం దూరంగా ఉంటోంది. మొత్తంగా మూడు రాజధానుల వ్యవహారంలో కాపులు చిరంజీవి వెంటే నడవడం ఆయన సోదరుడు పవన్ కల్యాణ్‌కు, ఆయన పార్టనర్ చంద్రబాబుకు షాక్ ఇస్తోంది.