అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా చినకాకానిలో ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్షారెడ్డిపై దాడి జరిగిందని తెలుస్తోంది. పిన్నెల్లిపై జరిగిన దాడిపై జగన్ సర్కార్ సీరియస్ అయింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో, ముఖ్యంగా ఆందోళనకారులను అదుపులో ఉంచడంలో పోలీసులు విఫలం అయ్యారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ‌్యంలో పిన్నెల్లిపై జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి పరిధిలోని 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చినకాకానికి చెందిన ఓ వ్యక్తి ఎక్కువ హల్‌చల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా టీడీపీ సానుభూతిపరులని పోలీసులు భావిస్తున్నారు. అమరావతి రైతుల ముసుగులో ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ‌్యంగా విద్యార్థులు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తంగా పిన్నెల్లిపై జరిగిన దాడిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లకు వ్యతిరేకంగా చంద్రబాబు, టీడీపీ నేతలు మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా పోలీసులు ఈ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. యాధృచ్చికంగా దాడికి పాల్పడ్డారా..లేదా పథకం ప్రకారం దాడి చేశారా అనే విషయంపై పోలీసులు ఆ పదిమంది నుంచి కూపీలాగుతున్నారు. ఈ దాడి వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
