ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చినకాకానిలో జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈ మేరకు పోలీసులు దాడికి పాల్పడిన పదిమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడికి పాల్పడింది..రైతులు కాదు చంద్రబాబు మనుషులే అని పిన్నెల్లితో సహా, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ పిన్నెల్లిపై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మేం ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఎన్ని జరిగినా కూడా మా నాయకుడు చూపిన బాటలో ఎక్కడా కూడా చిన్న ఘటనకు పాల్పడిన సంఘటన లేదు. మా నాయకుడు వైయస్ జగన్పై చివరకు హత్యాయత్నం జరిగినా కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్త, జగనన్న అభిమానులు సంయమనంతో ఉన్నాం. ఎక్కడా దాడులు చేయలేదు. మాకు చేతకాకకాదు. మా నాయకుడు ఒక పద్ధతి మాకు నేర్పారని మంత్రి అనిల్ అన్నారు.
చంద్రబాబు రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతారు. ఈ రోజు అక్కడక్కడ 100మందిని పెట్టుకుని దాడిచేస్తే మేం భయపడిపోతాం..వణికిపోతాం అనుకుంటున్నారు. మేం అనుకుంటే నువ్వు, నీ కొడుకే కాదు.. ఎవరూ కూడా ఇక్కడ తిరిగే ప్రసక్తే ఉండదంటూ అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతలు సహనం కోల్పోయి ఎదురుదాడికి దిగితే ఇదిగో జగన్ అరాచక పాలన అంటూ చెప్పాలనేది చంద్రబాబు కుటిల ప్రయత్నమని అనిల్ దుయ్యబట్టారు. పిన్నెల్లిపై దాడి చేయించింది కాకుండా.వైకాపా నాయకులే మనుషులను పంపి దాడులు చేయించుకున్నారని తెదేపా నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. . పిడుగురాళ్ల నుంచి కొంతమందిని, ఇంజినీరింగ్ కళాశాల నుంచి కొంతమందిని తీసుకొచ్చి రెచ్చగొట్టారు. మీరిలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామనుకోవద్దు… పిన్నెల్లిపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడి ఘటనలో కుట్రదారులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అనిల్ ఫైర్ అయ్యారు.