ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ ముందడుగు వేస్తుంటే… చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధానిపై రక్తకన్నీరు కారుస్తున్నారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దికి ప్రభుత్వం పాటుపడాలని ఏపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు మాత్రం అమరావతిపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. గత 20 రోజులుగా రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్‌తో సహా, రాజధాని ప్రాంత టీడీపీ నేతలు ఈ ఆందోళనలకు మద్దతు పలుకుతూ..విశాఖ, కర్నూలులో రాజధానులు వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. బంగారు బాతులాంటి అమరావతిని చంపేస్తారా అంటూ చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కుతుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు సేవ్ అమరావతి పేరుతో ఒక్క రోజు నిరాహారదీక్షలు చేపడుతున్నారు. మొన్న పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఒక రోజు నిరాహారదీక్ష చేసి మమ అనిపిస్తే..నిన్న విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఒక రోజు దీక్షలు చేపట్టారు. గద్దె ఒక్క రోజు నిరాహారదీక్షకు చంద్రబాబు హాజరై అమరావతి ఉద్యమం కోసం మహిళలనుంచి ఉంగరాలు, గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలు స్వయంగా సేకరించి సెంటిమెంట్ డ్రామా పండించారు.
ఇక పాలకొల్లులో నిమ్మల గారు కూడా తక్కువేం తిన్లేదు..తన ఒక్క రోజు దీక్షలో అయితే రాజధాని కోసం రక్తం చిందించారు. సోమవారం నాడు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్‌లో నిమ్మలగారు పొద్దున్నే ఒక్క రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని నిరసిస్తూ..సంతకం చేసి, రక్తంతో వేలిముద్రలు వేశారు. ఈ సందర్భంగా నిమ్మలగారు కూడా రక్తంతో వేలిముద్ర వేశారు. రక్తం చిందించైనా అమరావతిని కాపాడుకుంటామంటూ నిమ్మల గారు నినదించారు.
కాగా నిమ్మల చేస్తున్న రక్త పోరాటాన్ని చంద్రబాబు ఓ రేంజ్‌లో మెచ్చుకోవడం కొసమెరుపు. స్వయంగా నిమ్మలకు ఫోన్ చేసి అభినందించారు. ఇది ఆరంభమని, అమరావతిని రాజధానిగా సాధించుకునే వరకు ప్రజలందరూ ఉద్యమించాలని బాబు పిలుపునిచ్చారు. అయితే నిమ్మలగారి రక్త పోరాటం చూసి ప్రజలు నోరెళ్లపెట్టారు. రక్తం చిందించి, చెమటోడ్చి రైతన్నలు మూడు పంటలు పండించుకుని ఆనందంగా ఉంటే..మీ స్వార్థం కోసం వారికి స్వర్గం చూపించి, భూములు లాక్కున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే…ఎక్కడ మీ భూముల రేట్లు పడిపోతాయో అని అమాయక రైతులను రెచ్చగొట్టి రక్త కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడుతున్నారు. మీకు అమరావతి ప్రజలే కనిపిస్తున్నారా..సీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు బాగుపడడం ఇష్టం లేదా అంటూ టీడీపీ నేతలను నిలదీస్తున్నారు. మొత్తంగా నిమ్మల నెత్తుటి రాజకీయం చూస్తుంటే..రాజధానిపై ప్రజలలో భావోద్వేగాలను రేక్తిత్తించడం ద్వారా ప్రాంతీయ విద్వేషాలు రగిలించేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని అర్థమవుతుంది.