ఏపీలో మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై, జీఎన్‌రావు, బీసీజీ కమిటీల నివేదికలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అమరావతి గ్రామాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం రెండు కమిటీలు మూడు రాజధానులకు సానుకూలంగా నివేదికలు ఇవ్వడంతో హైపవర్ కమిటీ భేటీ తర్వాత మూడు రాజధానులపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నారు.
తాజాగా సీఎం వైయస్ జగన్ ఫ్లెక్సీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూసి అవమానించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసరాపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్రామ సచివాలయ భవనానికి అధికారులు సీఎం జగన్ ఫోటోతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేసరాపల్లిలో సీఎం జగన్ ఫ్లెక్సీకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగు పూసి అవమానించారు. ప్రత్యేకించి సీఎం జగన్ ఫోటోకు నల్లరంగును పోశారు. కాగా ఈ ఘటనపై స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజధాని ప్రాంత రైతుల ముసుగులో టీడీపీ కార్యకర్తలే ఈ పని చేసి ఉంటారని ఆరోపిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీల ఆధారంగా నల్లరంగు పూసిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా రైతుల ముసుగులో టీడీపీ నేతలే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు తలెత్తుతున్నాయి.