అమరావతిలో రైతుల ముసుగులో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రాష్ట్రంలో శాంతి,భద్రతల సమస్యను చిత్రీకరించడానికి దాడులకు పాల్పడ్డారు. రైతుల ముసుగులో మందు కొట్టి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌పై హత్యాయత్నం చేశారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బాడీ గార్డ్‌లను కూడా లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. పక్క ప్రణాళిక ప్రకారం పిన్నెల్లిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాగిన మత్తులో పిన్నెల్లి కారుపై దాడి చేశారు. రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎందుకు ఎంచుకున్నారో ఒక్క ఘటనతో అర్ధమవుతుంది. ప్రభుత్వ విప్ పిన్నెల్లిని చంపడానికి ప్రయత్నించిన వారు అందరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే. ఒక ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా, ఏమాత్రం భయం లేకుండా టీడీపీ కార్యకర్తలు అమరావతి వీధుల్లో వీరంగం చేశారు. తనకు, తన పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు చంద్రబాబు ఇలాంటివి క్రియేట్ చేస్తారని చరిత్రే చెబుతోంది. ఆందోళనలు, ఉద్యమాలు క్రియేట్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. ఆందోళనలు, ఉద్యమాలు శాంతియుతంగా జరగడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టముండదని గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. అంతేకాదు..నిప్పులాంటి నిజాలు అనే పుస్తకంలో కూడా రాశాడు. చంద్రబాబుకు హింస అంటే పరమ ప్రీతి. అందుకు అనుగుణంగానే అమరావతి రైతుల ఆందోళనలను హింసాయుతం చేయడానికి కొన్ని రోజలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి పిన్నెల్లి మీద దాడే ఉదాహరణ.
గొడవకు, హత్యాయత్నానికి పిన్నెల్లిని ఎంచుకోవడంలోనే టీడీపీ నేతల స్కెచ్ అర్ధమవుతుంది. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే. పైగా పల్నాడు ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు. పల్నాడు అంటేనే నేతలు, ప్రజలు కాస్త ఆవేశంతో ఉంటారు. ఎవరైనా ఏదైనా అన్నా, కొట్టినా వెంటనే ప్రతిదాడి చేస్తారు. దాడి తరువాత ఆలోచిస్తారు. ఈ తరహాలోనే టీడీపీ నేతలు ఆలోచించారు. పిన్నెల్లి మీద దాడి చేస్తే.. గుంటూరు జిల్లా ఎమ్మెల్యే మీదనే రాజధాని రైతులు దాడి చేశారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. రాజధాని పోతుందనే బాధలో సొంత జిల్లా ఎమ్మెల్యే మీదనే దాడి చేశారని ఎల్లో మీడియా భుజానికి ఎత్తుకుంటుంది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేపై దాడి చేస్తే ..ఆయన ఆవేశంతో కారు దిగి గొడవ చేస్తారు. చంపేయొచ్చు. బాడీ గార్డ్‌లు కాల్పులు జరుపుతారు. ముగ్గురు,నలుగురు అమాయకులు చనిపోతారు. దీంతో ..అమరావతిలో శాంతిభద్రతలు సమస్య ఉందని..రాజధాని రైతులను పోలీసులు కాల్చి చంపారని జాతీయ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తించవచ్చు.
కాని..ఇక్కడ చంద్రబాబు, టీడీపీ నేతలు అనుకున్నట్లు పాచిక పారలేదు. తెలుగు తమ్ముళ్లు దాడి చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి సంయమనం పాటించారు. బాడీ గార్డ్‌లకు సరైన సూచనలు ఇచ్చి ఫైర్ ఓపెన్ కాకుండా చూశాడు. పరిస్థితిని పిన్నెల్లి పూర్తిగా తన కంట్రోల్‌లో ఉంచుకుని చంద్రబాబు పాచిక పారకుండా చేశారు. దీంతో..కాల్పులు జరిగి కొందరు రైతులు , టీడీపీ కార్యకర్తలు చనిపోతే జాతీయ స్థాయిలో రచ్చ చేయాలి అనుకన్న చంద్రబాబు ప్లాన్ పారకుండా పోయింది. 29 గ్రామాల్లో కొన్నాళ్లుగా కేవలం రెండు, మూడు గ్రామాల ప్రజలే ఆందోళనలు చేస్తున్నారు. దానిని పెద్దగా క్రియేట్ చేయడానికి చంద్రబాబు , ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు నాయుడు సతీమణి కూడా రంగంలోకి దిగి గాజులు దానం చేశారు. దీనికి చంద్రబాబు ఎమోషన్ అనే పేరు పెట్టారు.
అమరావతి ప్రజల రాజధాని కాదు..చంద్రబాబు స్వార్థ రాజధాని. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లోని తన సామాజికవర్గాన్ని తన రక్షణ కవచంగా చంద్రబాబు పెట్టుకున్నారని గతంలోనే రాశాను. అమరావతిని రాజధానిగా ఎంచుకోవడంలోనే చంద్రబాబుకి వ్యక్తిగత సామాజిక స్వార్ధం ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గుంటూరు, విజయవాడ, అమరావతిల్లో చంద్రబాబు సామాజికవర్గీయులు తమ సొంత కులస్థులకే ఇళ్లు అద్దెకిచ్చారు. కులం అడిగి మరీ అద్దెలకిచ్చారు. ఇప్పుడు ఏకంగా వేరే కులస్థులు మీద దాడులకు దిగుతున్నారు. ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా దాడులకు దిగుతున్నారు. ఇక సామాన్యులకు చంద్రబాబు సామాజికవర్గం నుంచి రక్షణ ఎక్కడ ఉంటుంది?. ఉత్తరాంధ్ర వాసులు సౌమ్యులు, మెతక మనుషులు వారు అమరావతిలో వచ్చి ఉండగలరా?. రాయలసీమ వారిని ఫ్యాక్షనిస్టులుగా ముద్రవేసి ఇప్పటికే అమరావతిలో స్వేచ్ఛగా తిరగకుండా చేశారు చంద్రబాబు సామాజికవర్గీయులు. ఇటువంటి పరిస్థితుల మధ్య అమరావతి రాజధానిగా కొనసాగడం అనేది ఇతర ప్రాంతాల, ఇతర కులాల వారికి రక్షణ కాదు అనేది తేలిపోయింది. అమరావతి రాజధానిగా మార్చడం అనేది సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం కరక్టేనని ఇప్పుడు ప్రజలకు బోధపడుతుండాలి.
దాడి టీడీపీ నేతలకు తెలియకుండా జరగడానికి వీళ్లేదు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే దాడి జరిగి ఉంటుంది. దాడి విజయవంతమైతే మీడియాతో ఏం మాట్లాడాలి. దాడి విజయవంతం కాకపోతే మీడియాతో ఏం మాట్లాడాలి అనేది చంద్రబాబు అండ్ కో స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుని ఉంటారు. ఇప్పుడు రాజధాని వ్యతిరేకులే ఈ దాడి చేయించారని చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి అరుస్తారు. అంతేకాదు..రైతులను రెచ్చగొట్టింది కూడా వారేనని చెబుతారు. ఎందుకంటే..వైఎస్ షర్మిల చెప్పినట్లు కళ్లు ఆర్పకుండా అబద్దాలు ఎలా ఆడాలో చంద్రబాబుకు బాగా తెలుసు.
ప్రభుత్వ విప్ పిన్నెల్లిపై దాడిచేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అమరావతిని ఒక సామాజిక వర్గం తన సొంత ఆస్తిలా భావించడాన్ని ఉపేక్షించకూడదు. విజువల్స్ సాయంతో దాడికి పాల్పడిన వారిని తక్షణమే గుర్తించి శిక్షించాలి. ప్రభుత్వ విప్‌కే రక్షణ లేకపోతే ఇక సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది..?. పిన్నెల్లి రామకృష్ఱారెడ్డి సవాల్ విసిరినట్లు చంద్రబాబు కుట్రలతో పోరాడటం కాదు..తన ఆందోళనలో నిజాయితీఉంటే ప్రజల్లో ఉండి పోరాడాలి. దాడులతో ప్రభుత్వాలను బెదిరించాలని చూడటం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. చంద్రబాబు ఆయన కుమారుడు అండ్ టీడీపీ నేతలు ఎవరైనా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడాలి. అంతేకాని..ఎమ్మెల్యేపైనే హత్యాయత్నం అంటే సమర్ధనీయం కాదు. మీడియా కూడా సంయమనం పాటించి వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి.
ఓ జాతీయ పార్టీ రాజధానిని అమరావతి నుంచి తరలించడంపై ఓ సంస్థ ద్వారా సర్వే చేయించింది . ఈ సర్వే నిర్వాహాకులు 3వేల మందిని ప్రశ్నించారు. ఈ 3వేల మందిలో అన్ని వర్గాల వారు ఉన్నారు. అన్ని ప్రాంతాలవారు ఈ సర్వేలో పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం సచివాలయాన్ని విశాఖకు, హైకోర్ట్‌ను కర్నూలుకు తరలించడాన్ని మీరు సమర్ధిస్తారా అని ప్రశ్నించినప్పుడు.. 66 శాతం మంది అవునని, 27 శాతం మంచిది కాదు అని, 7 శాతం మంది చెప్పలేమని సమాధానం ఇచ్చారు. అన్ని అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారు కదా దానికి కారణం ఏంటని ప్రశ్నించినప్పుడు కులం అని 46 శాతం మంది, భూములు ముందు కొన్నారని 34 శాతం, ఏపీ మధ్యలో ఉంది, కొంత ఖర్చు పెట్టారని 20శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వే చూసిన తరువాత అయినా చంద్రబాబు తన ఆలోచను మార్చుకోవాలి. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. లేనిపక్షంలో ఇవే ఫలితాలు 2024లో కూడా రిఫీట్ అవుతాయి. దాడులతో, రెచ్చగొట్టే ప్రసంగాలతో చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదు. మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని చంద్రబాబు గౌరవించాల్సిన సమయం ఇది.
– వై. వి. రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్