ఆంధ్రప్రదేశ్ లో ‘స్కిల్ యూనివర్శిటీ’ ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. స్కిల్ యూనివర్శిటీ స్థాపనకున్న సాధ్యాసాధ్యాలు, అనువైన మార్గాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంయుక్తంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏ భాగస్వామ్య పద్ధతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఏ మార్గంలో వెళితే ఆర్థిక భారం లేకుండా ఎక్కువ మంది యువతకు శిక్షణ , ఉపాధి అందించవచ్చు , ఏపీలో ప్రస్తుతం అందిస్తోన్న శిక్షణలు, ఏపీఎస్ఎస్డీసీ బృందం దేశవ్యాప్తంగా ఉన్న స్కిల్ యూనివర్శిటీలను సందర్శించి సేకరించిన సమాచారాన్ని ఇరువురు మంత్రులకు ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ దేశంలోని ఇతర నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు, వ్యయం, అక్కడ యువతకు నేర్పించే శిక్షణ, పూర్తిగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైనది ఏది, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో స్థాపించినది ఏ విశ్వవిద్యాలయం వగైరా విషయాలపై ఆరా తీశారు.
ఏ సంవత్సరంలో ఏ విశ్వవిద్యాలయం స్థాపించారు, వాటి ప్రస్తుత పరిస్థితి, అక్కడ వసతి వంటి విషయాలను స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము, ఎండీ శ్రీకాంత్ మంత్రులకు వివరించారు. పార్లమెంటు నియోజకవర్గానికో స్కిల్ కాలేజ్ ఏర్పాటు, ఆ జిల్లాలోని ప్రాధాన్యతలను బట్టి శిక్షణనివ్వవలసిన కోర్సుల వివరాలను సిద్ధం చేసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ శ్రీకాంత్ ఇటీవల హర్యాణా రాష్ట్రంలోని శ్రీ విశ్వకర్మ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ రాష్ట్రంలోని భట్రియా విశ్వవిద్యాలయం, ఒడిశాలోని సెంచూరియన్, గుజరాత్ లోని టీమ్ లీజ్ స్కిల్ యూనివర్శిటీలను సందర్శించిన సందర్భంలో తెలుసుకున్న కీలక విషయాలను , స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీలకు కేటాయించిన స్థలం, స్థాపించిన సంవత్సరం, అక్కడ కోర్సులకు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను మంత్రులకు స్పష్టం చేశారు.