మీరు విన్నది నిజమే..టీడీపీ పీడ పోవాలి అన్నది..సాక్షాత్తు అనంతపురం మాజీ ఎంపీ, వివాదాస్సద టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి గారే ఈ మాటలు అన్నారు..ఏంటీ నమ్మలేకపోతున్నారా..నిజం..పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మోడీ సర్కార్ కనుక భారత్‌లో కలిపితే..వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని…దేశంలో మా తెలుగుదేశంతో సహా ప్రాంతీయపార్టీల పీడ పోవాల్సిందే..అని జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో స్థానిక నాయకులతో జేసీ పిచ్చాపాటి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో పరిపాలన బాగుండాలంటే ప్రాంతీయపార్టీలు పోయి జాతీయ పార్టీలు అధికారంలోకి రావాలని జేసీ సెలవిచ్చారు.
జాతీయ పార్టీల్లో అయితే దండించే పెద్ద దిక్కు ఉంటుంది..బీజేపీలో మోదీ, కాంగ్రెస్‌లో సోనియా…అదే ప్రాంతీయ పార్టీల్లో అయితే దండించేవారు ఉండకపోవడంతో వారు ఆడిందే ఆట..పాడిందే పాటగా సాగుతోందని పరోక్షంగా టీడీపీ, వైసీపీలకు చురకలు అంటించారు. ఈ సందర్భంగా బాబు. జగన్, స్టాలిన్‌లపై పరుష వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చంద్రబాబును అడిగే వాడు లేడంటూ బూతుపదం వాడారు. అలాగూ జగన్‌ని అడిగేవాడు లేడని.. డీఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి మద్రాస్‌లో ఆయనను అడిగేవాడు లేడని, ప్రాంతీయ పార్టీల్లో అధినేతలకు ఎదురు మాట్లాడే పరిస్థితి లేదని జేసీ చెప్పుకొచ్చారు. క్రమంగా ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తగ్గిపోతోందన్న జేసీ.. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి సాధ్యమని జేసీ కుండబద్ధలు కొట్టారు. అయితే ఆరోగ్యశ్రీ పథకం మంచి పథకమని జగన్‌ను అభినందించారు. అదే సమయంలో మా రెడ్డిగాళ్లకు మెదడు మోకాళ్లలో ఉంటుందంటూ జగన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు.
టీడీపీ ఘోర పరాజయం తర్వాత జేసీ ఫ్యామిలీ రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత కొంత కాలంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేస్తూ, జరిమానాలు విధిస్తున్నారు. మరో వైపు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జేసీ కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జేసీ టీడీపీని వీడి, బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల రోజుల క్రితం ఢిల్లీలో సుజనా చౌదరితో కలిసి బీజేపీ అగ్రనేత జేపీ నడ్డాను కలిసినప్పుడే జేసీ బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పీవోకే ఇష్యూపై స్పందిస్తూ దేశంలో టీడీపీతో సహా ప్రాంతీయ పార్టీల పీడ పోవాలంటూ జేసీ చేసిన వ్యాఖ్యల వెనుక ఆయన త్వరలోనే కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జేసీ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఆయన త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరుతారంటూ..తెలుగు తమ్ముళ్లు ఆఫ్ ది రికార్డుగా చెప్పుకున్నారు. మొత్తంగా టీడీపీలో ఉంటూ ఆ పార్టీ పీడ పోవాలంటూ వ్యాఖ్యానించడం జేసీ గారికే చెల్లింది. అనంతపురంలో స్థానిక నాయకులతో జేసీ పిచ్చాపాటి మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.