తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఈ మేరకు పోలీసులను దూషించిన కేసులో అయ్యన్నపాత్రుడికి ఈనెల 3న కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకి వెళితే..ఇటీవల అయ్యన్నపాత్రుడి సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.దీంతో ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలలో ఉంటున్న అన్నదమ్ముల మధ్య విబేధాలు రగిలాయి. ఈ సందర్భంగా సన్యాసిపాత్రుడి కుమారుడు వరుణ్ గత నెల 12న తన ఇంటిపై వైసీపీ జెండా కట్టేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే జెండా కట్టవద్దంటూ అయ్యన కుటుంబసభ్యులు అడ్డు తగలడంతో వివాదం రాజుకుంది. తనకు అయ్యన కుటుంబ సభ్యుల వల్ల ప్రాణహాని ఉందని వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా వరుణ్ మీద అయ్యన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నదమ్ముల ఇంటి గొడవ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. దీంతో నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అయ్యన్న నివాసం వద్ద ముందస్తు చర్యగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే అనుమతి లేకుండా నాఇంటికి ఎలా వచ్చారంటూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అయ్యన్న దూషించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డిసెంబర్ 20న పోలీసులు … అయ్యన్నపై 353, 506, 504, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జిల్లాకు రాకుండా తన చిన్న కుమారుడి పెళ్లి పనుల పేరుతో అయ్యన్న ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. ఇదే సందర్భంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్పీని కలిసి అయ్యన్నపై అక్రమంగా కేసు నమోదు చేశారంటూ ఫిర్యాదు చేశారు. అయ్యన్న జిల్లాకు ఎప్పుడొచ్చినా అరెస్టు చేసేందుకు జిల్లా పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారనే సమాచారం తెలియడంతో ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 3న అయ్యన్నకు బెయిల్ మంజూరు చేసింది. కాగా అయ్యన్నపాత్రుడు జనవరి 6 సోమవారం నాడు నర్సీపట్నం వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. మొత్తంగా కుటుంబ గొడవల్లో పోలీసులను దూషించి అయ్యన అడ్డంగా బుక్కయ్యాడు. చివరకు ఊరు వదలి..వేరే ప్రాంతాలలో ఉంటూ..బెయిల్ కోసం ప్రయత్నించాల్సి వచ్చింది. అందుకే అంటారు..రాజకీయాల్లో అతి పనికిరాదని..ఓవరాక్షన్ చేస్తే..ఫలితం ఇలాగే ఉంటుంది మరి..