ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని అన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాజధాని అంశంపై ప్రభుత్వం వేసిన రెండు కమిటీల నివేదికలు అందాయని, ఈ విషయమై హైపవర్ కమిటీలో చర్చిస్తామన్నారు.
కొత్త ఐటీ, పారిశ్రామిక పాలసీలు రూపొందిస్తున్నామని, కొత్త విధానాలపై వచ్చే బడ్జెట్లో ప్రకటిస్తామని చెప్పారు. అలాగే అదానీ సంస్థ విశాఖలో పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తిగా ఉంది. ఆ సంస్థ 400 ఎకరాలు అడగలేదు. ఆ కంపెనీ రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందన్నదానిలో వాస్తవం లేదని, కేవలం రూ.3 వేల నుంచి రూ.4 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. సౌదీ అరేబియాకు చెందిన 4 కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి. రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయని గౌతమ్‌రెడ్డి వివరించారు.