ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, సీమ నేతలు విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. అదే సమయంలో అమరావతిలో చంద్రబాబు చేయిస్తున్న ఆందోళనలపై తమ్మినేని మండిపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు జగన్మోహన్‌రెడ్డి కారణంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేందుకు అవకాశం వచ్చిందన్నారు. చంద్రబాబు మాత్రం ఈ ప్రాంతానికి అన్యాయం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. విజయవాడ, చెన్నై, ఢిల్లీ, ముంబై.. ఇలా ఏ నగరాలకెళ్లినా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు వచ్చి పలకరిస్తుంటే సంతోషించాలో, బాధపడాలో తెలీని పరిస్థితి దాపురించిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇంతమంది వలస వెళుతుంటే.. ఇక ఈ పదవులెందుకు?.. అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాజధాని అయితేనే ఈ పరిస్థితిని పారదోలవచ్చని.. రాజధానిగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
తాజాగా ధర్మవరం, దల్లిపేటలో సచివాయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు సందర్భంగా తమ్మినేని మరోసారి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తరతరాలుగా వెనుకబాటు తనానికి గురవుతున్న ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే నీకేంటని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు తథ్యమని స్పీకర్ అన్నారు. రాజధాని అమరావతి కోసం జైలుకైనా వెళ్తానని చంద్రబాబు అంటున్నారని, ఆయన తీహారు జైలుకెళ్లినా విశాఖపట్నంలో రాజధాని మాత్రం ఆగదని స్పీకర్ స్పష్టం చేశారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ పడిపోతుందన్న భయంతో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు మూడు రాజధానులపై రాద్ధాంతం చేస్తున్నారని, అంతే గానీ అమరావతిపై ప్రేమతో కాదన్నారు. తను రాజకీయాలు మాట్లాడటం లేదని.. ఉత్తరాంధ్ర పేదరికం, ప్రజల ఆకలి మంటలు, ఆక్రందనల నుంచి మాట్లాడుతున్నానని తమ్మినేని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ ఆలోచనను మార్చుకోవాలని స్పీకర్ హితవు పలికారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదన్నారు. తాను స్పీకర్‌గా మాట్లాడటం లేదని.. ఈ ప్రాంతానికి తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని స్థానికుడిగా ప్రశ్నిస్తున్నానని స్పష్టంచేశారు. చరిత్రలో మిగిలిపోయేలా ఉత్తరాంధ్ర రాజధానిగా విశాఖపట్నాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు.మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటు తథ్యమని స్పీకర్ తమ్మినేని సీతారాం తేల్చిచెప్పారు.