అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేయిస్తున్నాడు. చంద్రబాబు రాజధాని రాజకీయంపై వైసీపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ప్రయోజనాల కంటే…తన సామాజికవర్గ ప్రయోజనాలే ముఖ్యమై పోయాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని డోకిపర్రులో మాట్లాడుతూ.. చంద్రబాబు ఓ పగటి వేషగాడు, ఓ పిట్టల దొర అంటూ విరుచుకుపడ్డారు. రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కునేందుకు చంద్రబాబు తన ప్రభుత్వంలో పగటి వేషగాడిలా సొల్లు మాటలను చెబుతూ వచ్చారని నాని ఫైర్ అయ్యారు. జీఎన్ రావు, బోస్టెన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను బోగీ మంటల్లో వేయమని బాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ఆయన పాలనా విధానాలు నచ్చక రాష్ట్ర ప్రజలు బాబుకు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని మండిపడ్డారు. 74ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ కంపెనీ నివేదికను తప్పు బట్టే చంద్రబాబు కరెన్సీ నోట్లు మారినపుడు ఆ కంపెనీ నివేదికకు ఎందుకు తలొగ్గారని కొడాలి నాని ప్రశ్నించారు. అమరావతిపై ఎందుకు సింగపూర్ కంపెనీతో రూ.800కోట్లకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పిట్టల దొరలా రాజధాని రైతులకు దొంగ మాటలు చెప్పవద్దని మంత్రి హితవు పలికారు. రాజధాని రైతులు తమ కోర్కెలతో తమ ప్రభుత్వాన్ని కలిస్తే జగన్ మేలు చేకూరుస్తారని చెప్పారు. అంతేగాని బాబు మాటలు నమ్మి ఇంకా మోస పోవద్దన్నారు. అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదిలించినా ఊరుకునేది లేదంటూ..సుజనా చేసిన వ్యాఖ్యలపై కూడా నాని స్పందించారు. టీడీపీకి చెందిన సుజనా చౌదరి బ్యాంకులను లూటీ చేయటంతో ఎక్కడ జైల్లో వేస్తారోనని బీజేపీలోకి వెళ్లాడని నాని ఎద్దేవా చేశారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకే చంద్రబాబు మాయ మాటలు చెప్పారని నాని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలు చంద్రబాబును, ఆయన గ్యాంగ్ చెబుతున్న మాటలు నమ్మకూడదని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. బాబు చెప్పినట్టు గ్రాఫిక్ నిర్మాణాలు రాజధానిలో సాధ్యం కావని స్పష్టం చేశారు. మొత్తంగా చంద్రబాబు ఓ పగటి వేషగాడు, ఓ పిట్టలదొర అంటూ నాని చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.
