అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో గత 18 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరీ కూడా ఎర్రుబాలెం గ్రామంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అమరావతి, పోలవరం అంటూ తపించారు. ఇంత మంది మహిళలు బయటకు రావడం చూసి బాధేస్తుంది..అమరావతి రైతుల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేయరంటూ..భువనేశ్వరీ తన రెండు చేతిగాజులను ఆందోళనకారులకు డొనేట్ చేశారు. అయితే భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో రాజధాని రైతులను భూములను మీ భర్త బలవంతంగా లాక్కున్నప్పుడు మీకు బాధ వేయలేదా..గోదావరి పుష్కరాల్లో నీ భర్త పబ్లిసిటీ పిచ్చికి 37 మంది బలైపోతే ఆవేదన కలుగలేదా.. అయినా మీరు ఇవ్వాల్సింది చేతి గాజులు కాదు…మీరు లాక్కున్న భూములని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్, నటుడు పృథ్వీరాజ్ నారా భువనేశ్వరీ గాజుల త్యాగంపై తనదైన స్టైల్లో స్పందించారు.
అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ గాజులు డొనేషన్‌గా ఇవ్వడం రెండు గాజుల ప్లాటినం కథలా ఉందని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. అమరావతిలో రాజధాని కోసం రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమం కార్పొరేట్ ఉద్యమని మండిపడ్డారు. అసలు మూడు పంటలు పండుతున్నప్పుడు రైతుల నోటి దగ్గర కూడు ఎందుకు తీసుకున్నారు..ఆ రోజు పవన్ కల్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆ రోజు మా భూములు తీసుకోవద్దు..మా జీవితాలు ఆగమైపోతున్నాయంటే..బ్రహ్మాండమైన రాజధాని అన్నారు..ఒకపక్క సింగపూర్ అన్నారు..ఇంకోపక్క బాహుబలిలా కట్టేశా అన్నారు..నేను అమరావతి పెద్ద రాజధాని అనుకుని ఫస్ట్ టైమ్ సూట్ వేసుకుని వెళ్లా..అక్కడ కేవలం రేకుల షెడ్లు ఉన్నాయి.. అక్కడ ఏం లేదు..దిగితే మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నాయి..నాడు ప్రతిపక్ష నాయకుడు జగన్ ఛాంబర్‌లో నీళ్లు కారుతున్నాయి..అదీ మీరు కట్టిన అద్భుతమైన రాజధాని అని చంద్రబాబుపై సెటైర్ వేశారు.
అమరావతి ఆందోళనలపై పృధ్వీ మాట్లాడుతూ.. కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడినే..రైతు అంటే మోకాళ్లవరకు బురద ఉంటది..నలిగిపోయిన చొక్కా..పంపు సెట్టు దగ్గర కాళ్లు కడుక్కుని..అక్కడ చెట్ల కింద సేదదీరి.. కాస్త అన్నం తింటాం..ఆందోళనలు చేస్తున్న వారంతా రైతులైతే ఆడికార్లు, ఖద్దర్ షర్ట్‌లు, నాలుగైదు బంగారు గాజులు…ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి..వీరు రైతులా అని మండిపడ్డారు… ఇది నిజంగా రైతు పేరిట సాగుతున్న కార్పొరేట్ ఉద్యమని పృథ్వీ ఫైర్ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఇలాంటివి ఎందుకు కనబడటం లేదో ఆయనకే తెలియాలి’ అని పృథ్వీ అన్నారు. ఇంకా సిగ్గులేకుంటే..చూసి అయినా నేర్చుకోండి..ఇంకా మీ వెధవ రాజకీయాలు ప్రజల మీద రుద్దమాకండి అని ఫైర్ అయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రానున్న తరాలు బ్రహ్మాండంగా బాగుపడతాయని పృథ్వీ తెలిపారు. మొత్తంగా భువనేశ్వరీ గాజుల డొనేషన్‌పై, అమరావతి ఆందోళనలపై నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి.