ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు తాను మద్దతు ఇస్తున్నట్లు విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. రాజధానిగా విశాఖ అన్ని విధాల అనువైన నగరమన్న ఆయన అమరావతి రాజధానిగా పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ గతంలోనే చెప్పిందని గుర్తు చేశారు. రాజధానిగా అమరావతి వద్దని చెప్పినా నాడు చంద్రబాబు పట్టించుకోలేదని…ఇప్పుడు మాత్రం రాజధాని వ్యవహారంలో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విష్షుకుమార్ రాజు విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని విష్ణుకుమార్రాజు మరోసారి ఉద్భాటించారు. అయితే అమరావతి రైతుల కన్నీళ్లపై విశాఖ రాజధానిగా ఏర్పాటు కావాలనుకోవడం లేదని, ప్రభుత్వం అమరావతి రైతులకు అన్ని విధాల న్యాయం చేయాలని విష్ణుకుమార్ రాజు కోరారు. మొత్తంగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఏపీ బీజేపీ నేతలు దాదాపుగా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కన్నా, సుజనా చౌదరి వంటి నేతలు తప్పా..మిగిలిన బీజేపీ నేతలంతా మూడు రాజధానులపై జగన్ సర్కార్ నిర్ణయానికి జై కొడుతున్నారు.
