జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఒక పక్క పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా విమర్శలు చేస్తుంటే…మరోపక్క రాపాక మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూ సీఎం జగన్‌ను ఏకంగా మెస్సయ్యగా కీర్తించారు. అలాగే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంలో రాపాక ఏకంగా సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. ఇటీవల జగన్ పుట్టినరోజు నాడు కూడా ఆయన ఫోటోకు పాలాభిషేకం చేసి పార్టీలో రచ్చ లేపారు. అంతే కాదు కాకినాడలో పవన్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు హాజరు కాలేనని, అధ్యక్షుడు పవన్‌కు నాకు విబేధాలున్నాయని అసెంబ్లీలో వెల్లడించి పార్టీ పరువు తీశారు.
తాజాగా మరోసారి పవన్‌కల్యాణ్‌కు రాపాక షాక్ ఇచ్చారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. స్వయంగా అమరావతి గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపాడు. అయితే రాపాక మాత్రం ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు జై కొట్టాడు. అభివృద్ది వికేంద్రీకరణతోటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో నిధులన్నీ పెట్టి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని రాపాక తెలిపారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని రాపాక స్పష్టం చేశారు. మంచి ఉంటే స్వాగతిస్తానని, చెడు ఉంటే విమర్శిస్తానని ఈ సందర్భంగా రాపాక చెప్పుకొచ్చాడు. అయితే అమరావతి రైతులకు మాత్రం ప్రభుత్వం న్యాయం చేయాలని రాపాక కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమరావతికి మద్దతుగా పోరాడుతుంటే..ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం మూడు రాజధానులకు జై కొట్టడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాపాక తీరుపై జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. ఆయన్ని సస్పెండ్ చేయాలని అధ్యక్షుడు పవన్‌ను కోరుతున్నారు. అయితే పవన్ మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయితే మూడు రాజధానులపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను రికార్డు చేసి తీర్మానం చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. రాపాకతో మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేయించి, పవన్‌ను ఇరుకునపెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా రాపాక వర ప్రసాద్‌రావు తీరు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది.