తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లను తొలగించాలని, వీధులు, మురగుకాల్వలు శుభ్రం చేయాలని, వందశాతం పారిశుద్ధ్యం అమలయ్యేలా ప్రతి ఇంటి పరిసరాల్లో వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంత ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తమకు మహిళా సంఘం భవనం లేదని మహిళలు మంత్రిని కోరగా వెంటనే మంజూరు చేశారు. ప్రధాన రహదారిలో ఉన్న అటవీశాఖ అతిథిగృహం కబ్జాకు గురవుతోంది.
కొందరు తప్పుడు దస్త్రాలతో స్వాధీనానికి ప్రయత్నిస్తున్నారని అటవీశాఖ బీట్ అధికారి సుకన్య మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అటవీశాఖ అతిథిగృహం తాలూకు స్థలాన్ని బయటి వ్యక్తులు ఎలా కబ్జా చేస్తారని, వెంటనే హద్దులు నిర్ణయించి ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. గ్రామంలో ఇంటింటి చెత్తసేకరణకు ఇటీవలే కొనుగోలు చేసిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించి ట్రాక్టర్‌ను వీధుల్లో తిప్పారు.