ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ రిపోర్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. బోస్టన్ కమిటీ నివేదక తప్పుల తడక అని, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఏది చెబితే కమిటీ అది రాసి ఇచ్చిందని బాబు ఆరోపించారు. జీఎన్‌రావు కమిటీ కూడా అజయ్ కల్లాం ఇచ్చిన రిపోర్ట్‌నే నివేదికగా రాసిచ్చిందని బాబు వెల్లడించారు. గతంలో ఇలాంటి కన్సెల్టెంట్ కమిటీలు తప్పుడు నివేదికలు ఇచ్చాయని బాబు ఫైర్ అయ్యారు. శివరామ కృష్షన్ కమిటీ అందించిన నివేదిక ప్రకారం రాజధానిని విజయవాడ, గుంటూరు ప్రాంతంలోని అమరావతిని రాజధానిగా ప్రకటించామని బాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని కోసం కమిటీ వేసే హక్కు సీఎం జగన్‌కు ఎక్కడని బాబు ప్రశ్నించారు. జి.ఎన్.రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు రిపోర్టులను భోగి మంటల్లో వేసి తగలపెట్టాలని చంద్రబాబు పార్టీ వర్గాలకు ఆదేశించారు. అయితే బోస్టన్ కన్సల్టెంట్ ఇప్పుడేమి జగన్ సర్కార్‌కు కొత్తగా పని చేయడం లేదు..చంద్రబాబు హయాం నుంచే తన సర్వీసులను అందిస్తోంది. అప్పుడు ఇదే బీసీజీని బాగా వాడుకుని… ఇప్పుడు ఆ కమిటీ విశ్వసనీయతను ప్రశ్నించడం చంద్రబాబుకే చెల్లింది. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేసినట్లు బాబు చెప్పడం విచిత్రాలలో కెల్లా విచిత్రం.
అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఉన్న అమరావతి రాజధానిగా పనికారాదని శివరామకృష్ణన్ కమిటీ తేల్చి చెప్పింది. అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉందని, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని సూచించింది. రాజధానిని దొనకొండలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. అయితే చంద్రబాబు మాత్రం శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విజయవాడ – గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేసినట్లు బుకాయిస్తున్నాడు. రాజధాని ప్రాంత ఎంపికపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని ప్రకటించాలని ముందే అనుకున్న చంద్రబాబు, టీడీపీ నేతలు రాజధాని గ్రామాల్లో 4 వేలకు పైగా ఎకరాలు బినామీల పేరుతో కొనేశారు. అధికారంలోకి రాగానే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించాడు.
ఇప్పడు అమరావతిపై జీఎన్‌రావు, బీసీజీ కమిటీ, హైపవర్ కమిటీలు వేసే అధికారం సీఎం జగన్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న చంద్రబాబు తాను ఏ అధికారంతో 9 మందితో నారాయణ కమిటీ వేశాడో సమాధానం చెప్పాలి. నారాయణ కమిటీ… చంఢీగడ్, నయా రాయపూర్, నవీ ముంబయితో సహా పుత్రజయ, ఆస్టిన్, దుబాయి, సింగపూర్ తదితర దేశాలలో పర్యటించి…అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలని నివేదిక ఎందుకు ఇచ్చిందో చెప్పాలి. ఇప్పుడు జీఎన్‌రావు కమిటీ, బీసీజీ కమిటీ నివేదికలను జగన్ నివేదికలు అంటూ అక్కసు వెళ్లగక్కుతున్న చంద్రబాబు అప్పుడు నారాయణ కమిటీ నివేదిక బాబు నివేదిక కాదా…అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి… మొత్తంగా అమరావతిపై చంద్రబాబు బుకాయింపు రాజకీయం చేస్తున్నాడు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కిన చంద్రబాబు ఇప్పుడు అదే కమిటీ నివేదిక ప్రకారం అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశామని మాట మార్చేస్తున్నాడు. బాబు బుకాయింపును చూసి నాలిక మడతేయడంలో నీ తర్వాతే ఎవరైనా..ఛీఛీ..చంద్రబాబు నీది నోరా తాటి మట్టా…అని నెట్‌జన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.