ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎ జగన్ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆందోళనలను ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లేందుకుగాను రాజధాని గ్రామాల ప్రజలు ఇవాళ సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు వైసీపీ ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు ఇంటిని ముట్టడించి..అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతిపై తక్షణమే స్పందించాలన్న ఆందోళనకారుల డిమాండ్ మేరకు ఎంపీ లావు మాట్లాడారు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని.. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదన్నారు. రైతులంటే వైఎస్ఆర్, జగన్‌లకు ఎనలేని ప్రేమ అని.. రైతుల భూములను అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులు మనోభావాలు, వారి బాధలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రైతులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం వైఫల్యాలను ఆయన తప్పు పట్టారు. దేశంలో ఎక్కడా లేని విదంగా అమరావతికి రైతులు భూములు ఇచ్చారు. తమకు రాజధాని కావాలని తుళ్ళూరు రైతులు అడగలేదు. గత ప్రభుత్వమే రైతుల నుంచి భూములు తీసుకుంది. మూడేళ్ళలో భూములు అభివృద్ధి చేసి ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసింది. ఒప్పందం ప్రకారం గత ప్రభుత్వం న్యాయం చేయలేదని లావు శ్రీ కృష్ణ దేవరాయులు తీవ్రంగా ఆక్షేపించారు. అసలు రైతుల అగ్రిమెంట్లో ఏముందో మీడియాతో పాటు అందురూ తెలుసుకుంటే మంచిదని లావు అన్నారు. రాజధాని మార్పుపై అధికారిక ప్రకటన రాకముందే నేను స్పందించలేను’ అని ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయులు స్పష్టం చేశారు. మొత్తంగా అమరావతి రైతులు ఆందోళనలు చెందవద్దని…ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు భరోసా ఇచ్చారు.
