మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు..అంటూ గత రెండు వారాలుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా తన బంగారు గాజులు త్యాగం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీకి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోంటుండడంతో చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ రంగంలోకి దింపి, రాజధాని రాజకీయంలో మరింత సెంటిమెంట్ రంగరించారు. చంద్రబాబుతో కలిసి ఎర్రుబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న భువనేశ్వరీ మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రం కోసం ముఖ్యంగా అమరావతి, పోలవరం కోసం ప్రతి నిత్యం తపించిపోయారని, ఇంత మంది మహిళలు రోడ్డుపైకి రావడం తొలిసారి చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ చేస్తున్న ఉద్యమానికి తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. ఇంకేముంది అమరావతి ఉద్యమానికి భువనేశ్వరీ బాటలో విరాళాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయని ఎల్లోమీడియా ఊదరగొట్టింది.
అయితే నారా భువనేశ్వరీ గాజుల త్యాగంపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లను తీసుకువచ్చి చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని మండిపడుతున్నారు. భువనేశ్వరీకి రాజధానిలో రైతుల భూములను మీ భర్త బలవంతంగా లాక్కున్నప్పుడు రైతుల ఆక్రందనలు గుర్తుకు రాలేదా..పోలవరం నిర్వాసితుల్లో భూములు కోల్పోయిన గోదావరి జిల్లాల రైతులు, గిరిజన పోడు రైతుల కోసం ఎందుకు బయటకు రాలేదు..రాయలసీమకు నీళ్లు ఇవ్వకుండా చంద్రబాబు జీవోలు జారీ చేసినప్పుడు, నీళ్లు లేక, కరువుతో సీమ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే..బతుకుతెరువు కోసం సీమ మహిళలు మానాన్ని అమ్ముకుంటే… భువనేశ్వరీ ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. కేవలం మీ భూములు, మీ సామాజికవర్గానికి చెందిన వారి భూములకు విలువ పడిపోతుందనే భయంతో బయటకు వచ్చారని…ఇవ్వాల్సింది చేతి గాజులు కాదని..మీరు కొట్టేసిన భూములని వైసీపీ నేతలు భువనేశ్వరీపై తీవ్ర విమర్శలు చేశారు తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా నారా భువనేశ్వరీపై మండిపడ్డారు. సొంత తండ్రి ఎన్టీఆర్‌కు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీ లాక్కున్నప్పుడు భువనేశ్వరీ తండ్రికి మద్దతుగా ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ రోజా ఎద్దేవా చేశారు. మొత్తంగా తన భర్త సెంటిమెంట్ రాజకీయాల్లో ఇరుక్కుని, బయటకు వచ్చిన భువనేశ్వరీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.