ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు, పవన్‌లు అమరావతి గ్రామాల్లో పర్యటించి..రైతులను రెచ్చగొడుతూ… రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. అయితే పార్టనర్ల రాజకీయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాబు, పవన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అర్థరాత్రి కరకట్టకు వెళ్లి చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కొత్త బినామీ అని సెటైర్ వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనపై పోటీ చేసిన లోకేష్ గెలుపు కోసమే…పవన్ జనసేన నుంచి ఎవరినీ పోటీకి పెట్టలేదని విమర్శించారు. అయితే కమ్యూనిస్టులకు అవకాశం ఇచ్చినా..ఏ ఒక్క రోజు కూడా ఆ అభ్యర్థి గెలుపు కోసం పవన్ ప్రచారం చేయలేదని, అదే విధంగా తాడికొండలో కూడా జనసేన అభ్యర్థిని దింపకుండా… బలహీనమైన బీఎస్సీ అభ్యర్థిని దింపి, టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పవన్ ప్రయత్నించారని ఆర్కే ఆరోపించారు. దీన్ని బట్టి…పవన్ బాబు దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడని అర్థమవుతుందని ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఇక చంద్రబాబు హయాంలో అమరావతిలో రైతులుపెట్టిన పెరుగున్నం తిని… బలవంతంగా భూములు సేకరిస్తే… ఆమరణ దీక్ష చేస్తానని పవన్ చెప్పి…రైతులను పక్కదారి పట్టించి వెళ్లాడని, ఆ తర్వాత బాబు సర్కార్ ల్యాండ్ పూలింగ్ ద్వారా బలవంతంగా భూములు లాక్కుంటే…పవన్ ఎందుకు ఆమరణ దీక్ష చేయలేదని ఆర్కే ప్రశ్నించారు. రాజధానిలో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆధారాలతో సహా బయటపెట్టామని ఆర్కే చెప్పారు. ఇక తన భార్య పేరుతో మంగళగిరి నీరుకొండ గ్రామంలో 5 ఎకరాలు కొన్నానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా చేసిన విమర్శలపై ఆర్కే మండిపడ్డారు. తనకు 5 ఎకరాలు ఉందని రుజువు చేస్తే…తాను స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, అలాగే ఆ 5 ఎకరాలు చూపించినవారికే ఇచ్చేస్తానని ఆర్కే సంచలన ప్రకటన చేశారు. రాజధానిపేరుతో గత ఐదేళ్లలో చేసిన లక్షల కోట్ల అవినీతి బైట పడుతుందనే భయంతోనే చంద్రబాబు కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు 33 వేల ఎకరాలు ఇస్తే గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేసారు. ఐదేళ్లు సీఎం గా ఉండి కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామ్యంగా ఉండి ఒక్కటైనా ఒక పెర్మినేట్ బిల్డింగ్ కట్టారా అంటూ ఆర్కే నిలదీసారు అసలు రాజధానిలో అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ప్రజలు భావించారు కాబట్టే.. మంగళగిరి, తాడికొండలో టీడీపీని, లోకేష్ ను ఓడించారని ఆర్కే తెలిపారు. రైతులను బెదిరించి హింసించి కొట్టి రాజధానికి భూముల తీసుకున్నారని..33 వేల ఎకరాల్లో 10 శాతం మంది మాత్రమే చంద్రబాబును నమ్మి భూముల ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆ పది శాతమే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారని ఆర్కే స్పష్టం చేశారు. అసలు చంద్రబాబు కు ధైర్యం ఉంటే విశాఖలో రాజధాని వద్దు రాయలసీమ లో హైకోర్టు వద్దని చెప్పాలని ఆర్కే డిమాండ్ చేసారు. రైతులు నుంచి అన్యాయంగా భూములు తీసుకున్నప్పుడు భువనేశ్వరి ఎందుకు బైటకు రాలేదని ప్రశ్నించారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రాంతాలు కులాలు, మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆర్కే ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మొత్తంగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.