ఏపీకి మూడు రాజధానులపై ఏర్పాటుపై జీఎన్‌రావు కమిటీ నివేదికకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే మూడు రాజధానులపై జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికను చర్చించిన ఏపీ కేబినెట్ బీసీజీ (బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూపు నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. తాజాగా ఏపీకి మూడు రాజధానుల అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించారు. ఈ నెల 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ భేటీ అయి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి రాజధానిపై నిర్ణయం తీసుకోనుంది. బీసీజీ నివేదికపై హైపవర్ కమిటీ భేటీ అనంతరం రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 లోపు హైపర్ కమిటీ ప్రభుత్వానికి తుది రిపోర్టు అందించనుంది. కాగా హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సానుకూలత వ్యక్తం కాగా, అమరావతిలో మాత్రం తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీజీ నివేదికపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. అయితే బీసీజీ నివేదిక కూడా మూడు రాజధానుల వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ సమాచారం.అయితే రాజధాని అంశంపై సీఎం జగన్‌కు అందించిన బీసీజీ రిపోర్ట్‌లోని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
