రుణాల ఎగవేతపై టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి, ఆయన కుమారుడు రామారావు, ట్రాన్స్‌కాయ్ కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రాయపాటిపై కేసు నమోదు చేసింది. రూ. 16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ప్రాథమికంగా గుర్తించిన ఈడీ.. ఫెమా చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసింది. రాయపాటి తన కంపెనీ పేరుతో మొత్తం 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలను రుణాలను తీసుకున్నారు. వీటిలో దాదాపు 3,822 కోట్ల రూపాయలను సింగపూర్, మలేషియా, రష్యాలకు పెద్ద ఎత్తున తరలించినట్లు ఈడీ రాయపాటిపై అభియోగం మోపింది. అయితే టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులను దక్కించుకున్న రాయపాటికి చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థకు చంద్రబాబు ఎస్టిమేషన్లు పెంచేసి భారీగా లబ్ది చేకూర్చినట్లు, ప్రతిగా కమీషన్ రూపంలో వందల కోట్ల రూపాయలు టీడీపీ పెద్దలకు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులను బాబు సర్కారు బ్యాంకుల కన్సార్షియంకు చెందిన బ్యాంకులో కాకుండా…రాయపాటి చెప్పిన బ్యాంకులో వేసినట్లు, ప్రతిగా 250 కోట్ల రూపాయలు టీడీపీ పెద్దలకు ముడుపులు అందాయని సీబీఐ ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో సీబీఐ అధికారులతో పాటు, ఈడీ కూడా రంగంలోకి దిగి..ఈ వ్యవహారంపై కూలంకుశంగా విచారణ జరుపుతోంది. రాయపాటి దాదాపు 3,822 కోట్ల రూపాయలను సింగపూర్, మలేషియా, రష్యాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది.. తొలుత 16 కోట్లు సింగపూర్, మలేషియాకు మళ్లించినట్లుగా ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. దీంతో ఆ 16 కోట్లు సింగపూర్, మలేషియాలో ఎవరి ఖాతాల్లోకి మళ్లించారనే విషయంపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. కాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు బినామీలపేరుతో సింగపూర్, మలేషియాలో హోటళ్లతోపాటు, పలు సూట్‌కేసు సంస్థలు ఉన్నట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. కాగా పోలవరంలో తనకు లబ్ది చేకూర్చిన చంద్రబాబుకు ప్రతిఫలంగా రాయపాటి 16 కోట్ల రూపాయలు సింగపూర్ సూట్‌కేసు సంస్థల అకౌంట్లకు మళ్లించినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని టీడీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాయపాటిపై సీబీఐ, ఈడీ కేసుల నేపథ్యంలో టీడీపీ ఆయన్ని సస్పెండ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తంగా ట్రాన్స్‌కాయ్ సంస్థపై రుణాల ఎగవేత కేసుతో పాటు, ఫెమా చట్టం కింద నిధుల మళ్లింపు కేసు కూడా నమోదు కావడంతో రాయపాటి చిక్కుల్లో పడ్డారు. మరి ఈ కేసు ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో చూడాలి.