ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత చిరంజీవి హత్యకు పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రౌడీషీటర్ కన్నబాబు, పలాసకు చెందిన కరడుగట్టిన నేరస్థుడు పరమేశ్ సహా 9మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి నుంచి మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాంతానికి చెందిన మొదలవలస చిరంజీవి అధికార పార్టీ అయిన వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయనకు అమ్మినాయుడు, తేజేశ్వరరావు అనే వ్యక్తులతో పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చిరంజీవిని ఎలాగైనా హాత్య చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని కలిశారు. అతడి సాయంతో రౌడీషీటర్ కన్నబాబును కలిసి చిరంజీవి హత్యకు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకుని రూ.4లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన కన్నబాబు చిరంజీవి హత్యకు పలాస ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ పరమేశ్ సాయం తీసుకున్నాడు. అతడితో కలిసి కన్నబాబు గ్యాంగ్ కొద్దిరోజులు చిరంజీవిపై రెక్కీ నిర్వహించింది. అతడు రోజూ ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఏ సమయాల్లో ఒంటరిగా ఉంటాడు, ఎవరెవరిని కలుస్తాడు అన్న సమాచారం మొత్తం సేకరించారు. కొద్దిరోజుల్లోనే ఆయన్ని చంపేందుకు రెడీ అయిన సందర్భంలో ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పసిగట్టారు. దీంతో పోలీసులు కన్నబాబు, పరమేశ్ సహా 9మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్యకుట్రలో ఇంకా ఎవరెవరున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
