మాట తప్పని, మడమ తిప్పని నైజం తనది అని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్రలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మల రుణాలు దాదాపు పాతిక వేల కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలు బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ముందస్తుగా సంఘాల ఖాతాల్లొ ఒక రూపాయి జమ చేస్తున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల తేదీ ఏప్రిల్ 11 నాటికి రాష్ట్రవ్యాప్తంగా రూ. 5 లక్షల లోపు రుణాలు తీసుకున్న 6.25 లక్షల డ్వాక్రా మహిళా సంఘాలకు ఉన్న రూ.24, 603 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి వుంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా జమ చేస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. అంతవరకు ఆరు నెలలకు ఒకసారి వడ్డీ జమ చేస్తామని తెలిపింది. ఈ ప్రకారం..2019 సెప్టెంబర్ వరకు డ్వాక్రా రుణాలకు అయిన వడ్డీని రూ. 1, 236 కోట్లు సంఘాల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. దీంతో సెర్ప్ అధికారులు వడ్డీని జమ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఖాతాలు మనుగడలో లేకపోతే..సాయం పక్కదారి పట్టే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ముందస్తుగా పొదుపు సంఘాల ఖాతాల్లో ఒక రూపాయి జమ చేసి తనిఖీ చేస్తున్నారు. ఖాతాలన్నీ మనుగడలో ఉన్నాయని నిర్థారించుకున్న తర్వాత డ్వాక్రా మహిళల రుణాలకు అయిన రూ. 1, 236 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తంగా పాదయాత్రలో ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకోవడం పట్ల డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
