ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు జనసేన అండగా ఉంటుందని..ఎవరు ఆపినా సరే…పోరాటాన్ని ఆపొద్దని రైతులకు పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షనేతగా అమరావతికి ఆమోదం పలికారని, ఇప్పుడు మాట తప్పారని, మాట తప్పితే ఈ నేల క్షమించదంటూ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ విమర్శలపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తున్నా పవన్ కల్యాణ్.. ఇప్పుడు సీఎం జగన్‌పై విమర్శలు చేయడం సరికాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ నిన్నటిదాకా సింగపూర్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్నాడని, అక్కడ షూటింగ్ అయిపోయాగానే మంగళగిరికి వచ్చి షూటింగ్ మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు కలల రాజధాని అంటూ హడావుడి చేశారని విమర్శించారు. కానీ సీఎం జగన్ 13 జిల్లాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నారని వెల్లంపల్లి తెలిపారు. .
ఇక మరో వైసీపీ నేత జోగి రమేష్ కూడా పవన్‌కల్యాణ్‌పై పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో పవన్ నాలుగేళ్లు గోళ్లు గిల్లుకున్నారని.రమేశ్ విమర్శించారు. రంగులు మార్చుకోవడానికి, వేషాలు మార్చుకోడానికి, సినిమాలకు, ఆఖరుకి పెళ్లాలను మార్చుకోవడానికి పనికొస్తారు తప్ప.. రాజకీయాలకు పవన్ పనికిరాడని జోగి రమేష్ ధ్వజమెత్తారు. ‘రెండు చోట్ల పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవలేని ఈ పిచ్చి తుగ్లక్ మాకు చెబుతాడా.. మా సత్తా ఏంటో మాకు తెలుసు.. 151 మంది ఎమ్మెల్యేలం గెలిచాం.. అవసరమైతే.. 152.. 153 గెలుస్తాం.. అన్ని ప్రాంతాల అభివృద్ధే మా ముఖ్యమంత్రి ధ్యేయం’’ అంటూ జోగి రమేష్ తీవ్రస్థాయిలో పవన్‌పై విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని లేదని ఎవరైనా చెప్పారా.. తీసేస్తామని ఎవరైనా చెప్పారా.. అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా జోగి రమేష్ స్పష్టం చేశారు. అయితే తన పార్టనర్ చంద్రబాబుకు మద్దతుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు ఇస్తున్న పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలనే సదుద్దేశంతో మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తుంటే..కేవలం బాబు బ్యాచ్‌కు నష్టపోతుందనే కారణంతో పవన్ అమరావతికి జై కొడుతున్నాడని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా వైసీపీ నేతల విమర్శలతో జనసైనికులకు తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది.