ఒకప్పుడు వైయస్‌కు అత్యంత సన్నిహితుడిగా,. కాంగ్రెస్ పార్టీలో అగ్ర నేతగా వెలిగిన సబ్బం హరి…ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అయితే ఏ ఎండకా గొడుగు పట్టి తన పబ్బం గడుపుకోవడంలో సబ్బం ముందు వరుసలో ఉంటారు. వైయస్ మరణం తర్వాత జగన్‌కు సన్నిహితంగా ఉన్న సబ్బం హరి…2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో పలుమార్లు చంద్రబాబును భుజాన మోసిన ఈ మాజీ కాంగ్రెస్ నేత 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై ఒక విశాఖ వాసిగా హర్షం వ్యక్తం చేయాల్సిన సబ్బం హరి..అమరావతికి అనుకూలంగా మాట్లాడుతూ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. విశాఖను దోచుకోవడానికే రాజధాని రూపకల్పన అంటూ ఆరోపించారు. అమరావతి అంటే రాయలసీమవాసులకు భయమని ధ్వజమెత్తారు. వారం రోజుల్లో భీమిలిలో వైసీపీ నేతలను భూదందాలను బయటపెడతానని చెప్పుకొచ్చాడు. అయితే సబ్బం ఆరోపణలకు విశాఖ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలిజీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సబ్బం హరి విమర్శలపై స్పందించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోని దద్దమ్మల పార్టీ టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తే.. సబ్బం హరి లాంటి చిల్లర వ్యక్తులు విమర్శలు చేయడం తగదన్నారు. కంచరపాలెంలో సబ్బం హరి చేసిన చిల్లర పనులు ఇంకా జనం గుర్తుంచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని నట్టేట ముంచి. పార్టీ ఫండ్‌లు, అభ్యర్థుల నిధులు మింగేసిన ఘన చరిత్ర సబ్బం హరిది ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు తన అనుచరుల ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో రాజధానిపై రాద్ధాంతం చేస్తున్నారని, దానికి సబ్బం హరిలాంటి అవకాశవాదులు వత్తాసుపలుకుతున్నారని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇక పార్టీలు మారిన సబ్బం హరికి.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని విమర్శించే అర్హత లేదని ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. విశాఖలో రాజధాని రాకుండా చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తున్న సబ్బం హరిని ఉత్తరాంధ్ర ప్రజలు ఏమాత్రం క్షమించరని కొయ్యప్రసాద్‌రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సబ్బం హరికి వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.