ఏపీకి మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, అమరావతి ఆందోళనలకు మద్దతుగా కొద్దిసేపు దీక్ష చేసి సంఘీభావం తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తమ అభిమతమని కన్నా అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం ఆదేశాల మేరకే కన్నా దీక్ష చేశారని ఎల్లోమీడియా పచ్చ కథనాలు వండి వార్చింది. కాగా చంద్రబాబు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అయితే అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదిలించేది లేదని..కేంద్రం చూస్తూ వూరుకోదని అమరావతిలో తొడ కొడుతున్నారు. అయితే మరో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాత్రం ఏపీకి రాజధాని ఎక్కడ అనే అంశంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని, కేవలం సూచనలు మాత్రమే చేస్తుందని స్పష్టం చేశాడు. మరోవైపు బీజేపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే విష్ణు మాత్రం విశాఖలో పరిపాలనా రాజధానిపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటన చేశారు. పురంధేశ్వరీ వంటి సీనియర్ నేతలు సైతం అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు కేంద్రం కూడా అనుకూలంగా ఉందని ప్రకటించారు. ఇలా పరస్పర విరుద్ధర ప్రకటనలతో బీజేపీలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. కాగా అమరావతి ఆందోళనలపై ఇతర ఎంపీలు, నేతలు చేస్తున్న ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని జీవీయల్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది. దీనికే కట్టుబడి ఉన్నాం. నేను అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్ అన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని తరలింపుపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని జీవియల్ స్పష్టం చేశారు. మొత్తంగా మూడు రాజధానుల ఏర్పాటు విషయం రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధించినది.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని…ఇదే మోదీ సర్కార్ విధానమని..ఇందులో మరో మాటకు తావులేదని జీవియల్ కుండబద్ధలు కొట్టారు. ప్రస్తుతం జీవియల్ వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో కాకరేపుతున్నాయి.