అమరావతిలో రైతుల ఆందోళనల మంటలలో.. రాజకీయ చలి కాచుకుంటున్న వేళ.. చంద్రబాబుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు షాక్ ఇచ్చాడు. తాజాగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులు వద్దు…అమరావతి ముద్దు అంటూ చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని..వారి మాటలు వినద్దని గిరి కోరారు. ఐదేళ్లలో రాజధాని అమరావతిని ఎంత ఎంత అభివృద్ధి చేశామన్న విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. బాబు హయాంలో రాజధానికి కేవలం రూ.5 వేల కోట్లే ఖర్చు చేశారని ఈ సందర్భంగా గిరి గుర్తు చేశారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లుపైనే కావాలని, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది అసాధ్యమని తేల్చి చెప్పారు. మరోవైపు మూడు రాజధానులపై సీఎం ప్రకటనను గిరి స్వాగతించారు. రాజధానిపై సీఎం జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానులపై ప్రభుత్వం హై పవర్ కమిటీ వేసిందని, కమిటీ నివేదిక అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై ప్రజల్లో అనుకూలత ఉందని, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం దీనిపై ద్వంద్వ వైఖరితో ఉన్నారని మద్దాలి గిరి చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎం జగన్‌ను కలిశానని చెప్పారు. స్పందించిన సీఎం అక్కడికక్కడే రూ.25 కోట్లు నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ సమర్థంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కాగా చంద్రబాబుపై విమర్శల నేపథ్యంలో గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీని వీడడం ఖాయమైపోయింది. అయితే వంశీ బాటలో మద్దాలి గిరి కూడా ఇటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, అటు వైసీపీలో చేరకుండా అసెంబ్లీలో స్వతంత్ర్య ఎమ్మెల్యేగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. మొత్తంగా అమరావతిలో రైతుల ఆందోళనలకు టీడీపీ నాయకత్వం వహిస్తున్న వేళ గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి పార్టీకి గుడ్‌బై చెప్పడం చంద్రబాబుతో సహా తెలుగు తమ్ముళ్లను షాక్‌కు గురి చేసింది.
