ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. ఇవాళ అమరావతిలోని రైతులతో సమావేశమైన పవన్ వారికి భరోసా ఇస్తూనే చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమరావతిలో ఆందోళనలపై చంద్రబాబు స్పందిస్తూ..కేవలం తనపై ఎంతో భరోసాతో రాజధాని రైతులు భూములు ఇచ్చారని, అలాంటి వారికి జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందంటూ గగ్గోలు పెట్టాడు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు సర్కార్ ఆనాడు 33వేల ఎకరాలు సేకరించినప్పుడు భయమేసిందని పవన్ అన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి రైతులు భూమిలిచ్చారని.. అంతే కాని చంద్రబాబుపై, ఓ వ్యక్తిపై భరోసాతో రైతులు భూములివ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రైతులు నాడు చంద్రబాబును చూసి ఇవ్వలేదని, కేవలం ప్రభుత్వంపై భరోసాతో రైతులు భూములిచ్చారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాట తప్పడం దారుణమంటూ పవన్ తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానికి అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా జగన్ ఆమోదం తెలిపారని.. ఆనాడు ఆయన స్పష్టత ఇచ్చుంటే బాగుండేదన్నారు. ఆరోజు ఆయన గట్టిగా వ్యతిరేకించి ఉంటే.. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి అన్ని భూములు ఇచ్చేవారు కాదన్నారు. జగన్ ధర్మం తప్పారని… మాట తప్పితే ధర్మం తప్పినట్టేనన్నారు. మాట తప్పితే ఈ నేల క్షమించదని పవన్ ఊగిపోయారు. ఏపీ రాజధానిపై స్పష్టత ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు భరోసా కలిగించకుండా ముందుకు వెళితే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయిని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములిచ్చిన రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు. పోరాటాన్ని ఆపొద్దని.. ఎవరు ఆపినా సరే.. ఆపొద్దని పవన్ కల్యాణ్ రైతులకు పిలుపునిచ్చారు. అయితే మొత్తంగా అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ పవన్ కల్యాణ్ తన పార్టనర్ చంద్రబాబుకు మద్దతు పలుకుతూనే…మరో వైపు చంద్రబాబును చూసి రైతులను భూములు ఇవ్వలేదంటూ..పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకున్నారు. జనసేనాని తిక్కకు లెక్కే వేరు..జగన్ని తిట్టమని పంపిస్తే..బాబుగారి ఇజ్జత్ తీసిపడేశాడంటూ..పవన్‌పై టీడీపీ నేతలు విసుక్కుంటున్నారు.