ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత రచ్చ చేస్తున్నాడో..ఒకప్పటి బాబుగారికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అంతే రచ్చ చేస్తున్నారు. అసలు సిసలైన ఏపీ బీజేపీ నేతల కంటే సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని కదిలిస్తే వూరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై తొడగొడుతున్నారు. ఇదే సుజనా చౌదరి రాజధానిలో బినామీల పేరుతో 600 కు పైగా ఎకరాలు స్వాహా చేశారని ఆ మధ్య మంత్రి బొత్స లెక్కలతో సహా చెప్పారు. ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పడితే అమరావతిలో తన భూములకు ఎక్కడ విలువ తగ్గుతుందో అన్న భయమో, తన కులపెద్ద బాబుగారి బ్యాచ్‌కు బ్యాండ్ పడుతుందో అన్న బాధో ఏంటో కానీ…సుజనాగారు మాత్రం మిగిలిన కాషాయనాథులకంటే..విశాఖలో రాజధాని ఏర్పాటుపై విషం కక్కుతూ అమరావతిపాట కమ్మగా పాడుతున్నారు.
తాజాగా అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, అలాంటి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని రంకెలు వేశాడు. ప్రభుత్వ కార్యాలయాలను మూడు చోట్ల పెడితే ఎలాంటి లాభం ఉండదని, అసలు అంగుళం కూడా రాజధానిని కదిలించేందుకు వీల్లేదని జగన్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అన్నారు. రాజధానిని కదిలిస్తే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని, ఇలాగే కొనసాగితే పనామా, వెనెజులాగా మారుతుందన్నారు. రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదని, కేంద్ర పెద్దలతో చర్చించే ఈ విషయాలు మాట్లాడుతున్నానని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. అయితే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తూ వూరుకునేది లేదని వార్నింగ్‌లు ఇస్తున్న సుజనాచౌదరికి బాబుగారికి మరో అత్యంత సన్నిహితుడు..ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చాడు. రాజధాని ఎక్కడ అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలుగుతుందని కాని..జోక్యం చేసుకోదని.. అది రాష్ట్రాల విషయం అని సీఎం రమేష్ తేల్చి చెప్పాడు. మొత్తంగా అమరావతి నుంచి రాజధానిని మారిస్తే కేంద్రం ఒప్పుకోదన్నట్టుగా సుజనా చౌదరి బిల్డప్ ఇస్తే.. అబ్బే… రాజధాని విషయం కేంద్రానికి పెద్దగా సంబంధం లేదు.. కేవలం సలహా పాత్రే అని సీఎం రమేశ్ కుండబద్ధలు కొట్టారు. మొత్తంగా అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబుతో పాటు రచ్చ చేస్తున్న సుజనా చౌదరికి తన సాటి ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇవ్వడం అటు టీడీపీ, ఇటు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.