ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ వేములవాడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. అంతకు ముందు ఆలయం వద్ద సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకే రవిశంకర్, సంజయ్ కుమార్, రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డితో పాటు పలువురు స్వాగతం పలికారు. కాగా వేములవాడకు వచ్చే కంటే ముందు సీఎం కేసీఆర్ కాళేశ్వరం పథకంతో ఎత్తిపోసిన గోదావరి జలాలతో నిండుకుండలా మారిన శ్రీరాజరాజేశ్వర(మధ్య మానేరు) జలాశయాన్ని పరిశీలించారు. మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదికి కేసీఆర్ జలహారతి ఇచ్చారు.సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
