ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఓ పథకం ప్రకారం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో డిక్లరేషన్ అంటూ వివాదాన్ని చంద్రబాబు రగిలించాడు. అలాగే తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఉందనే వార్తలు వచ్చాయి. కాగా తిరుమలలో చర్చి అంటూ ప్రచారం చేసిన ముగ్గురు టీడీపీ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. అలాగే తిరుమల వెబ్‌సైట్‌లో, క్యాలెండర్‌లో యేసు పదం ఉందంటూ బాబుగారి అనుకుల పత్రిక చంద్రజ్యోతి అసత్య కథనాలు ప్రచురించింది. ఈ విషయంపై టీటీడీ వివరణ ఇస్తూ..సదరు చంద్రజ్యోతి పత్రికపై 100 కోట్ల దావా వేసేందుకు సిద్ధమైంది.
అయితే తాజాగా తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారంటూ సీఎం జగన్‌పై వస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కొట్టిపడేశారు. ఆదివారం నాడు కేంద్ర సహాయ శాఖ మంత్రి కృష్ణపాల్ గుర్జర్‌తో కలిసి తిరుమలను దర్శించుకున్న సుబ్రహ్మణ్యస్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా తిరుమలలో అన్యమతప్రచారం, మతమార్పిడులు అంటూ జరుగుతున్న ప్రచారం.. టీడీపీ చేయిస్తున్న చేస్తున్న కుట్రలో భాగమే అని స్వామి తేల్చేశారు. తిరుమల కొండపై శిలువ ఉందని చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని తేలిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వంపై మతపరమైన దుష్ర్పచారం చేస్తున్న వాళ్ళపై పరువునష్టం దావా వేసి క్రిమినిల్ కేసు పెట్టాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.
అంతేకాదు చంద్రబాబు హయాంలో జరిగిన టీటీడీ నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని సుబ్రహ్మహణ్య స్వామి ప్రభుత్వాన్ని కోరారు. బాబు హయాంలో ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్షకు రూ. 4 కోట్ల టీటీడీ నిధులను దుర్వినియోగం చేశారని ఇటీవల విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడిన సంగతి తెలిసిందే. అలాగే టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్థుడు అంటూ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని స్వామి స్పష్టం చేశారు. ఇక రమణ దీక్షితులను తిరిగి ప్రధాన అర్చకుడిగా తీసుకోవడం శుభపరిణామం అని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.ప్రస్తుతం తిరుమలలో సంప్రదాయాలన్ని ఆగమశాస్త్ర ప్రకారం పద్దతిగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారంటూ సీఎం జగన్‌పై వస్తున్న ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని స్వామి మరోసారి కుండబద్ధలు కొట్టారు. మొత్తంగా తిరుమలపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ కుట్ర ఉందని, చంద్రబాబు హయాంలో టీటీడీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారం రేపుతున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలకు షాక్ కొట్టినట్లైంది. కాగా తిరుమలపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక టీడీపీ ఉందని వైసీపీ చేస్తున్న విమర్శలకు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి.