ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని సుజనా చెప్పుకొచ్చారు. రాజధాని కదిలితే ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని హెచ్చరించారు. రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదని.. అసలు అంగుళం కూడా రాజధానిని కదిలించేందుకు వీల్లేదంటూ జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. సుజనా చౌదరి విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో స్పందించారు. టీడీపీ నుంచి ఇంకో పార్టీలో చేరిన ఓ నేత.. రాజధాని ఒక అంగుళం దాటినా బీజేపీ ఒప్పుకోదని అంటున్నారు. ఆయన మాటేమైనా శాసనమా? అని మండిపడ్డారు..చంద్రబాబుకు తొత్తువా? లేకపోతే మోదీ నీకు ఏమైనా చెవిలో చెప్పారా? ఎందుకు అలా ఘీంకరిస్తున్నావు అంటూ సుజనాపై బొత్స సెటైర్ వేశారు. అసలు సుజనాచౌదరికి వ్యా పారం చేసుకోవడం, ఆస్తులు పెంచుకోవడం తప్పితే అభివృద్ధి గురించి ఏం తెలుసని బొత్స ఫైర్ అయ్యారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి పది నగరాల్లో ఒకటై న విశాఖలో రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే హైదరాబాద్‌ను తలదన్నే నగరంగా తయారవుతుందని బొత్స అన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు తొత్తు అయిన సుజనా చౌదరి తెలుసుకోవాలని మంత్రి బొత్స హితవు పలికారు. మొత్తంగా చంద్రబాబు తొత్తువా…అంటూ సుజనా చౌదరిపై మంత్రి బొత్స చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
