ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ నాయకులు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్ థాకరే ,రష్మీ థాకరే దంపతులకు 13 జూన్ ,1990న ఆదిత్య జన్మించారు. ముంబైలోని బాంబే స్కాటిష్ పాఠశాలలో ఆదిత్య విద్యనభ్యసించారు. సెయింట్ జేవియర్ కళాశాలలో బీఏ చదివిన ఆయన కేసీ న్యాయ కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ అనే పుస్తకం పేరిట 2007లో పద్యాలు రాశారు. ఎనిమిది పాటలు కూడా ఆయన రాశారు.ఈ ఏడాది జరిగిన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఆదిత్య థాకరే వొర్లి నియోజకవర్గం నుండి ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానేపై డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2010లో ఆదిత్య యువసేన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017లో ముంబై డిస్ట్రిక్ ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా.. 2018లో శివసేన పార్టీ నాయకుడిగా నియామకమయ్యారు.