అధికారంలో లేకపోయినా అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలకు ఆడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. నరసాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల సీఎం జగన్ ధర్మవరంలో నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. దీంతో జేసీ వర్గీయులు రంగంలోకి దిగారు. డిసెంబర్ 26, గురువారం సాయంత్రం జేసీ సోదరుల ముఖ్య అనుచరులైన టీడీపీ నాయకులు రామాంజులరెడ్డి, భాస్కర్‌రెడ్డిల వర్గీయులు ఇద్దరు స్థానిక గ్రామ వలంటీర్ ఉక్కీసల నాగేష్ వద్దకు వెళ్లి తమకు ‘నేతన్న నేస్తం’ వర్తింపజేయాలని బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. విషయం కాస్తా వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలియడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. అయితే టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయిన ఆ వలంటీర్ వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో వైసీపీ నాయకులు సదరు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. మొత్తంగా గత ఐదేళ్లు అధికారంలో దర్జాగా ప్రభుత్వ పథకాలను స్వాహా చేసిన తెలుగు తమ్ముళ్లు..ఇప్పుడు అధికారంలోకి లేకపోయినా దౌర్జన్యంతో చేసి మరీ దోచుకోంటున్నారు. ప్రభుత్వం ఇలాంటి తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలను ఆరికట్టి సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
