తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మారుమూల గ్రామాల నుంచి చదువు కోసం వస్తున్న అమ్మాయిల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పేదరికంతో పెద్ద పెద్ద కాలేజీల్లో చదవలేక… సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న యువతులు పరిస్థితి మరింత దిగజారుతోంది. తాజాగా ఆసిఫాబాద్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు గర్భం దాల్చారు. ఇందులో ఓ విద్యార్థిని మూడునెలల గర్భవతని వైద్య అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఉంచినట్లు తెలుస్తోంది.
పదిమంది అమ్మాయిలకు సరిగా రుతుస్రావం జరగకపోవడంతో … అనుమానం వచ్చి అధికారులు వారిని రిమ్స్ ఆస్పత్రి తరలించారు. దీంతో పరీక్షలు చేసిన డాక్టర్లు ముగ్గురు విద్యార్థినిలు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. వీరిలో ఒకరు మూడునెలల గర్భవతని తేల్చారు. అమ్మాయిలంతా డిగ్రీ ఫస్టీయిర్ చదువుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌సీఓ లక్ష్మయ్య విద్యార్థినుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. దాదాపు రెండు నెలలే ముందే ఈ విషయం తెలిసినా కూడా..సమాచారం రానివ్వకపోవడంతో హాస్టల్ సిబ్బందిపై, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.విషయం తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు ఈ ఘటనపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.