ఏపీకి మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు తన స్టాండ్‌ను ప్రకటించాడు. అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుందని అదే టీడీపీ విధానమని తెలిపాడు. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మాత్రం తమ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టీడీపీ నేతలైతే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు మద్దతు పలుకుతూ.. తీర్మానం చేసి ఏకంగా చంద్రబాబుకే పంపారు. దీంతో టీడీపీ ఉన్నపళంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం నష్టనివారణ కోసం రంగంలోకి దిగింది. ఇప్పటికే చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని రగలిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అమరావతికి అనుకూలంగా జేఏసీలు ఏర్పాటు చేయించి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు శ్రీకాకుళంలో తమ చెప్పు చేతల్లో ఉండే కొందరు నేతలను రంగంలోకి దించింది. శ్రీకాకుళంలో గురువారం సాయంత్రం మూడు రాజధానులు వద్దు– అమరావతి ముద్దు అనే నినాదంతో చేసిన ర్యాలీలో 30 మందికి మించి కన్పించలేదు. నిత్యం రద్దీగా ఉండే ఏడు రోడ్ల జంక్షన్‌లో చేపట్టిన కొవ్వుత్తుల ర్యాలీకి జనాల నుంచి స్పందన లేదంటే వారు ఎత్తుకున్న నినాదానికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ఎన్ని జిత్తుల మారి ఎత్తులు వేసినా తమ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్దామని, భజన చేసే నాయకుల ట్రాప్‌లో పడేది లేదని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు చెప్పకనే చెబుతున్నారు. అసలు విశాఖను రాజధాని చేస్తే వీరికొచ్చే నష్టమేంటి? అమరావతిలో కొన్న భూముల విలువ తగ్గిపోతుందన్న భయమా? రాజకీయంగా కనుమరుగైపోతామన్న ఆందోళనా? అని ప్రజలు పెదవి విరిచిన పరిస్థితి కనిపించింది అయినా ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు సైతం కలిసి రాకపోవడంతో కేవలం 30 మందితో మమ అనిపించే పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం రగిలించాలన్న చంద్రబాబు ప్లాన్ ఆదిలోనే బెడిసికొట్టింది.