ఏపీకి మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తూ…ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో చెలరేగిపోయాడు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక.. మరి జగన్ రెడ్డికి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? అంటూ పవన్ విమర్శించారు. అంతే కాదు అమరావతిలో రైతుల ఆందోళనకు పవన్ మద్దతు పలికారు. అయితే మూడు రాజధానుల విషయంలో పవన్ తీరుపై ఉత్తరాంధ్ర, సీమ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. నిజానికి అసలు అమరావతి ప్రాంతంలో కంటే..ఉత్తరాంధ్ర, రాయలసీమలోనే పవన్ కల్యాణ్‌కు కొద్దొగొప్పో ఫాలోయింగ్ ఉంది. ఉద్దానం కిడ్నీ రోగులకు మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని పవన్ పట్ల ఉత్తరాంధ‌్ర ప్రజల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. అయితే మూడు రాజధానులను వ్యతిరేకించడంపై పవన్‌పై ఉత్తరాంధ‌్ర ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రగిలాయి. ఈలోగా తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటన చేశాడు. దీంతో పవన్ కల్యాణ్ ఇరకాటంలో పడ్డాడు. అందుకే మూడు రాజధానులపై, జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మాట్లాడుతానని చెప్పి..పవన్ వూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిమిత్తం భార్యతో కలిసి రష్యాకు వెళ్లివచ్చిన పవన్ కల్యాణ్ గురువారం నాడు పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ నెల 30 న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి జనసేన పొలిట్ బ్యూరో రాజకీయ వ్యవహారాల కమిటీలతో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలు హాజరవుతారట. ఆ రోజు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. ఆయా ప్రాంతాల్లో రాజధానులపై ప్రజల మనోభావాల గురించి పవన్ ఆరాతీస్తారంట.. ఆ తర్వాతే… మూడు రాజధానేలపై తమ స్టాండేమిటన్న విషయాన్ని అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని జనసేన పార్టీ మీడియాకు ప్రకటించింది. సో..కేబినెట్ భేటీలో జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఈ నెల 30 న మాత్రమే పవన్ కల్యాణ్ మూడు రాజధానులపై తన స్టాండ్ ఏంటనేది ప్రకటిస్తారు. దీన్ని బట్టి మూడు రాజధానులను వ్యతిరేకిస్తే సీమ, ఉత్తరాంధ్రలో పార్టీ పూర్తిగా క్లోజ్ అవుతుందనే భయంతోనే పవన్ ఇలా మౌనం పాటిస్తున్నాడని అర్థమవుతోంది. మొత్తంగా అమరావతి రైతులకు మద్దతుగా ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతాడనుకున్న పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకుని మూడు రాజధానుల కాన్సెప్ట్‌కు జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.