పై ఫోటోలో వైట్ షర్ట్, ఖాళీ ప్యాంట్ వేసుకుని సైకిల్ తొక్కుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓ వ్యక్తి వెళుతున్నాడు గమనించారా… ఆ వ్యక్తి ఆసుపత్రిలోకి వెళ్లి…కింద కూర్చుని పేద రోగులను ఆప్యాయంగా పలకరించాడు. అలాగే తనకు ఎదురైన ఓ తాతను పలకరించి..పాణం బాగుందా…చూయించుకున్నవ తాతా..అని అడిగాడు.. అంతే కాదు ఆరోగ్య మిత్ర కౌంటర్ దగ్గరకు వెళ్లి వారితో రోగుల గురించి ఆరా తీస్తున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..ఆయనే నిజామాబాద్ కలెక్టర్..సి. నారాయణరెడ్డి. అవును..మీరన్నది నిజం..సినిమాల్లో ఇలాంటి సీన్ చూసుంటాం.కాని రియల్ లైఫ్‌లో ఇలాంటి సీన్లు చూడడం చాలా అరుదు. ప్రజలతో మమేకం అయ్యే అధికారులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అతి కొద్ది మంది అధికారుల్లో కలెక్టర్ నారాయణరెడ్డి ముందు వరుసలో ఉంటారు. తాను ఎక్కడ పని చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటూ..ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకుంటూ..వాటిని తక్షణమే పరిష్కరిస్తారు.
నీతి, నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు సేవలందించే కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కోసం కలెక్టర్ తన అధికార కాన్వాయ్‌తో కాకుండా సింగిల్‌గా సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లారు. తాను బస చేస్తున్న ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అధికారులకు, సెక్యూరిటీకి సమాచారం ఇవ్వకుండా.. ఎన్టీఆర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఓ సాధారణ వ్యక్తిలా ఆయన ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న సిబ్బంది నుంచి ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు తెలుసుకున్నారు. ఉదయం విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు కాకపోవడంతో వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక వైద్య సదుపాయాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కాగా నారాయణరెడ్డి నిన్న మొన్నటి వరకు ములుగు కలెక్టర్‌గా బాధ్యతలు వహించారు. ప్రతిష్టాత్మక మేడారం జాతరకు అన్నీ తానై అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేయించారు. ప్రధాన రహదారులు, సివిల్ వర్క్స్, పార్కింగ్ వసతులు, జంపన్న వాగు పనులు, తాత్కాలిక టాయిలెట్స్, బాత్రూంలు, షెడ్స్ ఇలా అన్ని పనులను శరవేగంతో అధికారులను పరుగులు పెట్టించి పూర్తి చేయించారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా ప్రకటించి..ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం ఆయన్ని ములుగు నుంచి నిజామాబాద్‌కు బదిలీ చేసింది. అయితే ఇప్పటికే మేడారంలో రోడ్లతో సహా అన్ని ఏర్పాట్లను నారాయణరెడ్డి పూర్తి చేయించడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా తమలో ఒకడిగా సైకిల్‌పై వచ్చి తమను పలకరిస్తుందని కలెక్టర్ నారాయణరెడ్డి అని తెలిసి రోగులు ఆశ్చర్యానందం వ్యక్తం చేశారు. మొత్తంగా కలెక్టర్ నారాయణరెడ్డి నిరాడంబరతకు, చొరవకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.