ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతోపాటు, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు స్వాగతిస్తుండగా ప్రధానంగా అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. రైతుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఆందోళనలు చేయిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. కాగా అమరావతిలో ఆందోళనలకు ఎల్లోమీడియా పెద్ద ఎత్తున కవరేజీ ఇస్తుంది. అమరావతిలో జరుగుతున్న ఆందోళనలపై ఎల్లోమీడియా ఛానళ్లు, మినిట్ టు మినిటు లైవ్ ప్రసారాలు అందిస్తున్నాయి. అంతే కాదు లైవ్ డిబెట్లు పెట్టి సీఎం జగన్‌పై, రాయలసీమవాసులపై నోరు పారేసుకుంటున్నాయి. ఇక పచ్చ పత్రికలైతే అమరావతిలో రైతుల ఆందోళనలు అంటూ పచ్చ కథనాలు పచ్చిగా వండివారుస్తున్నాయి. వాస్తవాలను దాటిపెట్టి కేవలం తమ కులప్రభువు చంద్రబాబుకు ఏదో అన్యాయం జరగబోతుందనే అక్కసుతో జగన్ సర్కార్‌పై విషం కక్కుతున్నాయి.
తాజాగా బాబుకు భజన చేసే చంద్రజ్యోతి పత్రికలో వచ్చిన ఓ కథనం చూస్తే సదరు పత్రికాధిపతి ఎంత నిస్సిగ్గుగా బరితెగించాడో అర్థమవుతోంది. వైసీపీకి ఓటేసినందుకు వైసీపీ కార్యకర్తలు, రైతులు తమను తాము చెప్పులతో కొట్టుకుంటున్నట్లు సదరు పత్రిక పచ్చ కథనాలు వండివారుస్తోంది. తాజాగా మందడం గ్రామంలో వైసీపీకి ఓటు వేసి తప్పు చేశానంటూ..చెప్పులతో కొట్టుకుంటున్న వ్యక్తి అంటూ ఓ ఫోటో వేసి ఓ పచ్చ కథనం ప్రచురించింది. అయితే ఇక్కడే ఆ పచ్చ పత్రిక తన తెలివితేటలు ప్రదర్శించింది. అసలు ఈ ఫోటో ఇప్పటిది కాదు..గతంలో చంద్రబాబు హయాంలో రాజధానికి భూములిచ్చి మోసపోయానని ఓ రైతు తనకు తాను చెప్పుతో కొట్టుకున్నాడు. అప్పుడు అన్ని ప్రధాన పత్రికల్లో ఆ ఘటనపై కథనాలు వచ్చాయి. అదే ఫోటోను ఇప్పుడు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు పచ్చ పత్రిక వాడుకుంది. అదే ఫోటోను మళ్లీ ప్రచురించి జగన్‌కు ఓటేసినందుకు మందడంలో తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్న వ్యక్తి అంటూ ఓ స్టోరీ అల్లేసి తన అక్కసు తీర్చుకుంది. అయితే సోషల్ మీడియా యుగంలో తామేం ప్రచురించినా ప్రజలు నమ్మేస్తారనే భ్రమలో ఇంకా ఎల్లోమీడియా ఉంది. ఈ కథనం చూసి నెట్‌జన్లు వెంటనే ఇదే వ్యక్తి చంద్రబాబుకు భూములు ఇచ్చినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడని గుర్తించి పాత కథనాలను వెలికిదీసి…పచ్చ పత్రిక బండారం బయటపెట్టారు. మొత్తంగా సోషల్ మీడియా దెబ్బకు సీఎం జగన్‌ను బద్నాం చేయాలనుకున్న పచ్చ పత్రిక కుట్ర బట్టబయలైంది. దీంతో నెట్‌జన్లు ఆహా కిరసనాయిల్..ఈ ఫోటోషాప్ జిమ్మిక్కులు నీకే సాధ్యమంటూ ఏకిపారేస్తున్నారు.