ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనకు పీపుల్స్ స్టార్‌గా పేరుగాంచిన నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మద్దతు పలికారు. ఇటీవల ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన నారాయణమూర్తి తాజాగా విశాఖలో పరిపాలనా రాజధానిగా చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరుగుతూ అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని సీఎం జగన్ ఎంతో దూరదృష్టితో తీసుకున్నారని కొనియాడారు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నాయని, ఇక్కడి ప్రజలు రాష్ట్రాలు, దేశాలు దాటి కూలీలుగా వలస వెళుతున్నారని ఆర్. నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఇన్నాళ్లకు విశాఖ వాసులకు మంచి రోజులు వచ్చాయని, సీఎం జగన్ నిర్ణయాన్ని అంతా సమర్థించాలని నారాయణమూర్తి కోరారు. కాగా వామపక్ష పార్టీల అధినేతలు దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో కంటే..తమ సామాజికవర్గం ఎక్కువగా ఉండే అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ చంద్రబాబుకు మద్దతు పలుకుతుంటే..నిజమైన వామపక్షవాదిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆర్.నారాయణమూర్తి విశాఖలో పరిపాలనా రాజధానిని స్వాగతించడం గమనార్హం. అందుకే ఆయన పీపుల్స్ స్టార్‌గా పేరుగాంచాడు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో పీపుల్స్ సీఎం జగన్‌కు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మద్దతు పలకడం ఏపీ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఇప్పటికే సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన విషయం తెలిసిందే. మరి నారాయణమూర్తి బాటలో టాలీవుడ్ నుంచి ఎవరెవరు విశాఖలో రాజధానికి జై కొడతారో చూడాలి.
