రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టిడిపి నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.
టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. రైతులకు కులం ఆపాదిస్తారా? రైతులు ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డారా అంటూ ట్విటర్ లో తన వాదన తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రాజధాని కోసం 29,881 మంది రైతులు 34,322 ఎకరాల భూములు ఇచ్చారు. వీళ్ళలో ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతులు 20,490 మంది. ఒకటి నుంచి 2 ఎకరాల మధ్య ఉన్న రైతులు 5,227 మంది. కేవలం 159 మందికి మాత్రమే 10 ఎకరాలకు మించి భూమి ఉంది. అందులో కూడా కొంతమందివి ఉమ్మడి కుటుంబాలు. అంటే రాజధానికి భూములిచ్చిన రైతుల్లో 25,717 మంది సన్నకారు రైతులే. వీళ్లకేనా వైసీపీ నేతలు కులం అంటగట్టి కక్ష తీర్చుకుంటోంది. ఈ పేదలేనా ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ చెబుతోంది?. పేదరికానికి కూడా కులం ఉంటుందా?. అని లోకేశ్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.