మిర్చి సిన్మాలో తన కుటుంబాన్ని శత్రువుల నుంచి రక్షించుకున్న తర్వాత హీరో ప్రభాస్ విలన్‌తో ఇప్పటిదాకా ఓ లెక్క…ఇప్పటి నుంచో ఇంకో లెక్క..ఆయన కొడుకు వచ్చాడని చెప్పు…అంటూ వీరావేశంతో కొట్టిన డైలాగ్ ప్రేక్షకులను అలరించింది. సేమ్ టు సేమ్ రాజకీయాల్లో కూడా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించేందుకు వైయస్ కొడుకు జగన్ వచ్చాడని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంటున్నారు. తాజాగా మూడు రాజధానులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేయిస్తున్న ఆందోళనలపై తమ్మినేని స్పందిస్తూ..ఇప్పటిదాకా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తొలగించే వాడు ఎవడా అని ఇంతకాలం ఎదురుచూశామని… ఇంతకాలానికి జగన్ వచ్చారంటూ ఎమోషనల్ అయ్యారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు మూడు రాజధానులతో పేరుతో సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని…ఇలాంటి సమయంలో ఆయనకు మద్దతుగా ఉత్తరాంధ్ర ప్రజలు నిలబడాలని తమ్మినేని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ‌్ర కోసం ఇంత ధైర్యంగా నిలబడిన సీఎం జగన్ నాయకత్వాన్ని వదులుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉందదని తమ్మినేని అన్నారు.
ఇక రాష్ట్రంలో అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ముందుకు వస్తుంటే టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని తమ్మినేని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో కీలక నగరమైన విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు అనుకూలమా..వ్యతిరేకమా అన్నది చెప్పాలని సూటిగా సమాధానం చెప్పాలని స్పీకర్ తమ్మినేని డిమాండ్ చేశారు. అమరావతిలో టీడీపీ ఎందుకు మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేయిస్తుందో జవాబు చెప్పాలని అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ కుప్పకూలినందుకు చేస్తున్నారా…కొన్న భూములకు విలువ పడిపోతుందనే భయంతో చేస్తున్నారా అంటూ నిలదీశారు. అమరావతిలో భూములు కొన్న కొందరు పచ్చ చొక్కాల వారు మాత్రమే ఆందోళన చేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. మొత్తంగా ఉత్తరాంధ్రలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న కుట్రలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఎండగట్టారు. మరోవైపు సీఎం జగన్‌కు ఉత్తరాంధ్ర ప్రజలు నైతిక మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు.