గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు.
మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌కు ఉచ్చు బిగుస్తోంది. యరపతినేనిపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై ఉన్న 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌కు సంబంధిచిన వివరాలను జీవోలో పొందుపర్చింది.
యరపతినేనిపై ఉన్న కేసులకు సంబంధించి హైకోర్టు విచారణ జరిపి గతంలోనే తీర్పును వెలువరించింది. సీఐడీ దర్యాప్తు తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు కోసం సీబీఐ విచారణ చేపట్టాలని పేర్కొంది. ఐతే సీబీఐ విచారణ చేపట్టలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే యరపతినేనిపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక సీబీఐకి అప్పగించిన తొలి కేసు ఇదే కావడం విశేషం.