మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు తన సామాజికవర్గ ప్రయోజనాలకే పాకులాడడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారా..విశాఖ, కర్నూల్‌లో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న బాబుపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు చేయనున్నారా….త్వరలోనే మూడు రాజధానుల విషయంలో తెలుగుదేశం పార్టీ ముక్కలు కానుందా..ప్రస్తుతం అమరావతి వేదికగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటనను, జీఎన్ రావు కమిటీ నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా దేవినేని ఉమ వంటి రాజధాని ప్రాంత నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో గంటా, కొండ్రు మురళీ వంటి సీనియర్ టీడీపీ నేతలతో సహా విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు సమావేశమై మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశారు. అయితే చంద్రబాబు, లోకేష్‌లు మాత్రం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలను కించపరుస్తూ..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి…మూడు రాజధానులు వద్దు అనేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రధానంగా అమరావతి ప్రాంతంలో ఒక సామాజికవర్గం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు బాబు, లోకేష్‌లు దగ్గరుండీ నాయకత్వం వహిస్తున్నారు. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని బాబు, లోకేష్‌లు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు.
అయితే మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ..మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. మూడు రాజధానులతోనే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం కంటే తమకు తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయించుకున్నారు. తమ ప్రాంతాల్లో రాజధానులు ఏర్పడకుండా చంద్రబాబు చేసే కుట్రలను అడ్డుకునేందుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీ అధినేతగా..మూడు రాజధానుల ఏర్పాటుకు సహకరించేది పోయి..ఇలా అమరావతి ప్రాంతంలో అల్లర్లును రెచ్చగొడుతున్న చంద్రబాబుపై మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కేవలం తన కులం కోసమే పని చేస్తారా..రాష్ట్రంలో మిగతా కులాలు లేవా అని వారు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో అసలు నగరమే లేని అమరావతిని మాత్రమే డెవలప్ చేయాలా.. ఆల్రెడీ నగరాలైన విశాఖ, కర్నూలు డెవలప్ కావడం బాబుకు ఇష్టం లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే మూడు రాజధానులకు చంద్రబాబు జై కొట్టకపోతే తిరుగుబాటు చేసేందుకు మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు సిద్ధమవుతున్నారు. మొత్తంగా మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా రగులుతుంది. త్వరలోనేఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ముక్కలైనా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.